Historic Meeting: సరెండర్ అయిన మావోయిస్టు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చరిత్రాత్మక భేటీ: కేంద్ర సహకారంతో రాజకీయ పార్టీగా మార్పు సాధ్యమని వెల్లడి

కేంద్ర సహకారంతో రాజకీయ పార్టీగా మార్పు సాధ్యమని వెల్లడి

Update: 2026-02-28 02:11 GMT

Historic Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో శుక్రవారం సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ భేటీలో సాయుధ పోరాట విరమణ, పీఎల్‌జీఏ రద్దు, రాజకీయ ప్రవేశం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. డీజీపీ శివధర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి (ఎలియాస్ దేవ్‌జీ), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (ఎలియాస్ సంగ్రామ్), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (ఎలియాస్ దామోదర్/జగన్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి (ఎలియాస్ గంగన్న) ఇటీవల డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. వీరితో పాటు గతంలో లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ (ఎలియాస్ చంద్రన్న), కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి (ఎలియాస్ సుజాతక్క) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమిస్తామని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా జీవన స్రవంతిలో భాగమై చట్టబద్ధంగా ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడించారు. కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అమిత్ షా ఒప్పుకుంటే ఇక్కడికే పిలిపించి సభ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇది తమ చేతుల్లో లేని విషయమని, హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, సౌకర్యాలపై చంద్రన్న మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే రివార్డు మొత్తం ఇక్కడ కూడా పెంచాలని, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వెంటనే ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రివార్డు మొత్తం పెంచడంపై డీజీపీకి అధ్యయనం చేయమని, నివేదిక ఇవ్వమని ఆదేశించారు. వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదని, ఇతర అంశాలను క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

రాజకీయ అంశాలకు సలహాదారు కేశవరావు, ఆర్థిక అంశాలకు వేం నరేందర్ రెడ్డిని సంప్రదించవచ్చని సీఎం సూచించారు. లొంగిపోయిన నేతలను అభినందిస్తూ హింస ఎలాంటి సమస్యకు పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని గుర్తుచేశారు. వారికి పూర్తి భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ చరిత్రాత్మక భేటీ తెలంగాణలో మావోయిజం ముగింపుకు, శాంతి ప్రక్రియకు మరింత బలం చేకూరుస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News