మిడిల్ క్లాస్‌కు మోయలేని భారంగా ఇళ్లు!
Housing is an unaffordable burden for the middle class!;
హైదరాబాద్‌లో చుక్కలనంటుతున్న రియల్ ఎస్టేట్ రేట్లు యువ టెక్కీలకు తీవ్ర భారంగా పరిణమిస్తున్నాయి. కొందరైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలైనప్పటికీ.. సొంతిల్లు గానీ, ఫ్లాట్‌గానీ లేక పోవడంతో పెళ్లిళ్లు కూడా చేసుకోలేక పోతున్నామని తెగ మధనపడిపోతున్నారు. ఇంకొందరైతే ఇల్లు కొనడం కన్నా కనీసం ప్లాట్ కొనుక్కోవడం మంచిదనుకుంటున్నారు. ఒకప్పుడు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు అఫార్డిబుల్ హౌసింగ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు అందని ద్రాక్ష మాదిరిగా తయారయ్యింది. ఓ మాదిరిగా, బాగా సంపాదిస్తున్న టెక్ ఎక్స్‌పర్ట్స్‌ను కూడా దడదడలాడిస్తోంది. ఆస్తుల ధరలు ఆకాశాన్నంటుతుండటం, కుటుంబ బాధ్యతలు పెరుగుతుండటం, ఏదో ఒక సొంతిల్లు సొంతం చేసుకోవాలన్న తీవ్రమైన ఒత్తిడి, ప్రధానంగా యువకులైతే.. వివాహం చేసుకోవాలన్న ఆలోచనల మధ్య ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఈ పరిస్థితులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇళ్లు,విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల ధరలకు, వాస్తవంగా వాటిని కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ల కొనుగోలు స్థాయికి మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి దాదాపు 40 నిమిషాల డ్రైవింగ్ దూరంలో ఉన్న బ్రాండెడ్ కాని మామూలు అపార్ట్‌మెంట్ల రేట్లు కూడా ఇప్పుడు రూ.1.2కోట్ల నుంచి రూ.1.5 కోట దాకా ధరలు పలుకుతున్నాయి. నగరానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండిపెండెంట్ హౌజ్‌ల రేట్లు రూ.70 నుంచి రూ.80 లక్షలు పలుకుంటున్నాయి. ధరలు ఈ స్థాయిలో పైకి ఎగబాకుతుండటంతో.. ఓ ఇంటిని సొంతం చేసుకోవడం అనేది ఓ మాదిరి ఉద్యోగులు, ఎక్కువ జీతం తీసుకుంటున్న వాళ్లకు కూడా భరించలేకుండా తయారయ్యాయంటున్నారు.
భారతీయ సంస్కృతిలో సొంతిల్లు అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లికి ముందే ఓ సొంతిల్లు ఉండాలన్న లక్ష్యం ప్రతి ఒక్కరిదీ... అయితే, అది క్రమంగా ఓ తప్పనిసరి రూల్‌గా పరిణమించింది. దీంతో, చాలామంది టెకీలు తమకు సొంతిల్లుగానీ, ఫ్లాట్‌గానీ లేకపోవడంతో పెళ్లిళ్లు కూడా కావడం లేదని అంటున్నారు. అయితే, ఇండిపెండెంట్ హౌజ్ అంటే అందని ద్రాక్షగా మారిన ఈ పరిస్థితుల్లో ఇండిపెండెంట్ ఇళ్లకన్నా.. అపార్ట్‌మెంట్లవైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు.