Huge Salaries for Faculty in Remote Medical Colleges: మారుమూల వైద్య కళాశాలల్లో అధ్యాపకులకు భారీ వేతనాలు: 'యూ కోట్ వి పే' విధానం అమలు
'యూ కోట్ వి పే' విధానం అమలు
Huge Salaries for Faculty in Remote Medical Colleges: తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల వంటి దూరప్రాంతాల్లోని కళాశాలల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో అనేక విభాగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దీంతో విద్యార్థులు పాఠాలు లేక నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 'మీరు ప్రతిపాదించండి... మేం చెల్లిస్తాం' (యూ కోట్ వి పే) అనే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధ్యాపకులను నియమించుకునే అవకాశం ఉంది. సాధారణ వేతనాలకు మూడింతలు ఎక్కువ చెల్లించే అవకాశం ఉండటంతో, మారుమూల ప్రాంతాల్లోనైనా వారు పనిచేసేందుకు ఆసక్తి చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విధానం అమలు ప్రక్రియ ఇలా ఉంటుంది: ఒక పోస్టుకు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరూ దరఖాస్తు చేయకపోతే, 'యూ కోట్ వి పే'ను అమలు చేస్తారు. సాధారణంగా ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1.25 లక్షలు వేతనం చెల్లిస్తారు. కానీ కొత్త పద్ధతిలో ఇది మూడు రెట్లు పెరిగి, ప్రొఫెసర్లకు గరిష్ఠంగా రూ.5.70 లక్షలు, అసోసియేట్‌లకు రూ.4.50 లక్షలు, అసిస్టెంట్‌లకు రూ.3.75 లక్షలు వరకు చెల్లించవచ్చు. దరఖాస్తుదారులు తమకు కావాల్సిన వేతనాన్ని ప్రతిపాదిస్తారు. టెండర్లలో మాదిరిగా తక్కువ కోట్ చేసిన వారిని ఎంపిక చేస్తారు. ఒకే దరఖాస్తు వచ్చినా, అది గరిష్ఠ పరిమితిలో ఉంటే ఆ వ్యక్తినే నియమిస్తారు. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధులను కూడా వినియోగిస్తారు. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది.
రాష్ట్రంలో 35 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి, వీటిలో చాలా కొత్తవి. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్ వంటి ప్రాంతాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో అనేక విభాగాలు ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద లేదా పొరుగు సేవల పద్ధతిలో 'యూ కోట్ వి పే' ద్వారా బోధకులను నియమించాలని వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కసరత్తు మొదలైనట్టు ఆయన వెల్లడించారు. ఈ విధానం అమలుతో మారుమూల ప్రాంతాల వైద్య విద్యా సంస్థలు బలోపేతమవుతాయని అధికారులు ఆశిస్తున్నారు.