Indiramma Family Life Insurance Scheme: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: విధివిధానాలు నేడు ఖరారు
విధివిధానాలు నేడు ఖరారు
Indiramma Family Life Insurance Scheme: రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ విధివిధానాలను నేడు మంగళవారం ఖరారు చేయనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఉన్నతాధికారులు, పథకం అమలుకు సహకరించే భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపి, విధివిధానాలను ఖరారు చేసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నివేదించనున్నారు.
పథకం ముఖ్యాంశాలు:
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సార్వత్రిక జీవిత బీమా ప్రయోజనం కల్పించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలనే ప్రతిపాదనపై ఇప్పటికే విస్తృత చర్చలు జరిగాయి. ఇటీవల మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
నేటి సమావేశంలో పథకం వివరాలు, అమలు విధానాలు, లబ్ధిదారుల ఎంపిక, బీమా సంస్థలతో ఒప్పందాలు, ప్రీమియం చెల్లింపు విధానం వంటి అన్ని అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీన ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, అనివార్య మరణాల సమయంలో ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అధికారవర్గాలు సమాచారం అందించాయి.