Kavitha’s Criticism: కవిత విమర్శలు: బీఆర్‌ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి కారణం

బీఆర్‌ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి కారణం

Update: 2026-02-14 12:47 GMT

Kavitha’s Criticism: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. భాజపా-బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో సీపీఎం, సీపీఐలను 'తోక పార్టీలు' అని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తోక పార్టీలకు తోక పార్టీగా మారుతోందని కవిత వ్యాఖ్యానించారు.

సింగరేణి కుంభకోణంపై సీపీఐ, ఏఐటీయూసీ నోరు విప్పకపోవడాన్ని ఆమె ఖండించారు. కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో కేటీఆర్‌పై ఏమి మాట్లాడారో కేటీఆర్ గుర్తుచేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ ఎన్ని మున్సిపాలిటీలను కోల్పోయిందో ఆలోచించాలని అన్నారు. నిజామాబాద్‌తోపాటు అన్ని చోట్లా కేడర్‌ను పూర్తిగా వదిలేసినట్లు విమర్శించారు.

కేటీఆర్, మాజీ మంత్రులు ఎన్ని చోట్ల ప్రచారం చేశారని, కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఎక్కడ పోరాటం చేస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ కొన్ని చోట్ల మూడో స్థానంలో, మరికొన్ని చోట్ల నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. కరీంనగర్ మినహా భాజపా ఎక్కడా లేదని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో 40కిపైగా స్థానాల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని కవిత తెలిపారు. వడ్డేపల్లిలో తమకు పూర్తి ఆధిక్యం వచ్చినా అధికార పార్టీ, ఇతరులు ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. 16 మున్సిపాలిటీలు రావడమే గొప్పగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో తమ లాంటి వారిని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం కలుగుతోందని చెప్పారు.

తానే రాజు, తానే మంత్రి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు హామీల అమలుపై దృష్టి పెట్టాలని కోరారు. తమది ట్రైలర్ మాత్రమేనని, పిక్చర్ ఇంకా మిగిలే ఉందని కవిత అన్నారు. తొందరపడి కారు కూతలు కూయవద్దని, తప్పులు సరిదిద్దుకొని ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. సింగరేణి ఎన్నికల్లో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News