CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సలహాలు ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో రూ.484 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి “సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కేసీఆర్ కూడా హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలి. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మాకు అవసరం” అని కోరారు.
“బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామని కేటీఆర్, హరీశ్‌రావు అంటున్నారు. కేసీఆర్‌తో పాటు వారిద్దరూ కూడా అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతోంది. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. ఈ 32 నెలల్లో మూడు రోజులైనా సెలవు తీసుకున్నానా?” అని ప్రశ్నించారు.
యువత ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని గుర్తు చేస్తూ “ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం యువతను రెచ్చగొట్టింది. ఇటీవల తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు ఒక్క చుక్క రక్తం కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు రక్తం ఇస్తే అమ్ముకుని కోట్లు సంపాదించారు” అని విమర్శించారు.
నిరుద్యోగులకు సంబంధించి సీఎం “ధర్నాలు, ర్యాలీలు చేసి సమయం వృథా చేసుకోకండి. ధర్నాల్లో పాల్గొంటే కేసులతో భవిష్యత్తు నాశనమవుతుంది. నిరుద్యోగుల కోసం నేనున్నా.. మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాను. కేసీఆర్ ‘ఫ్యామిలీ జస్టిస్’ చేస్తే.. నేను సోషల్ జస్టిస్ చేశాను. కేసీఆర్ సీఎం అయితే ఆయన కుటుంబానికే లాభం. నేను ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది” అని స్పష్టం చేశారు.