Kinjarapu Ram Mohan Naidu: ఆదిలాబాద్‌లో అతి పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం: కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
Kinjarapu Ram Mohan Naidu: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించిన అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజిబులిటీ ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డితో మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం నిర్వహించారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు అంశంపై ఇవాళ కీలక చర్చ జరిగిందని, ఆదిలాబాద్‌లో అతి పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు సుమారు 300 ఎకరాల భూమి ఉందని, సివిల్ ఏవియేషన్ శాఖతో కలిసి జాయింట్ వెంచర్ రూపంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ మీట్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సంకేతాలు కనిపించాయి. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా ఆ ప్రాంత ఆర్థిక, పర్యాటక అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు, తెలంగాణలో విమానయాన సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.