Mahesh Kumar Goud: అందరం డ్రగ్స్ టెస్టులు చేయించుకుందాం – ప్రతిపక్ష నేత, సభా నాయకుడికి పిలుపు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత, సభా నాయకుడికి పిలుపు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Mahesh Kumar Goud: ‘‘భారాస పదేళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అయ్యాయి. డ్రగ్స్ పరీక్షలు అందరం చేయించుకుందాం. ఇందుకు కాంగ్రెస్ సభ్యులంతా సిద్ధం. ప్రతిపక్ష నేతకూ పరీక్షలు జరగాలి. కేసీఆర్ రావాలి. అలాగే టెస్టులకు సభానాయకుడిని కూడా తీసుకొస్తా’’ అని శాసనమండలి సభ్యుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాత అసెంబ్లీ భవనంలో మంగళవారం నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రతిపాదించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం సాగింది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌ను నిర్వహించి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. ఇటీవల బయో ఆసియా-2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో రూ.1,700 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చాం. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
డ్రగ్స్‌పై మహేశ్‌కుమార్ వ్యాఖ్యలకు భారాస సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణలో డ్రగ్స్ సమస్యను ఎత్తి చూపుతూ, అందరూ పరీక్షలు చేయించుకోవాలని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రతిపాదన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.