Minister Uttam Kumar Reddy: ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా సక్రమంగా కొనసాగుతోంది: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Minister Uttam Kumar Reddy: రాష్ట్రంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాఫీగా సాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాలను వివరించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 810 మంది ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, వారి ద్వారా 1.3 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో 28 లక్షల మంది 'దీపం' పథకం కింద ఎల్‌పీజీ వినియోగిస్తున్నారు. 7.5 లక్షల మంది కమర్షియల్ సిలిండర్లను వాడుతున్నారు. ప్రతి నెల 58 నుంచి 60 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ అవుతున్నాయన్నారు.
గత కొద్ది రోజులుగా ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లు సాధారణం కంటే రెట్టింపు పెరిగాయని, అయితే డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందీ లేదని మంత్రి వివరించారు. గతంలో రోజుకు 2.15 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేసేవారమని, ఇప్పుడు రెండు రోజులుగా 2.3 లక్షలు సప్లై చేస్తున్నామని చెప్పారు.
కమర్షియల్ సిలిండర్ల విషయంలో మాత్రం కొంత కొరత ఉందని, రోజుకు అవసరమైన సంఖ్యలో కేవలం 20 శాతం మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నామని తెలిపారు. గతంలో రోజుకు 23 వేల కమర్షియల్ సిలిండర్లు పంపిణీ అయ్యేవని, ప్రస్తుతం 6 వేలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని వివరించారు.
ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా, సాధారణంగా బుక్ చేసుకోవాలని సూచించారు. గృహాలకు అవసరమైన ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చారు.