Mahila Shakti Super Bazaars: మహిళా శక్తి సూపర్ బజార్లు: రాష్ట్రవ్యాప్తంగా 119 బజార్లు

రాష్ట్రవ్యాప్తంగా 119 బజార్లు

Update: 2026-05-26 12:05 GMT

తొలి దశలో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున సూపర్ బజార్లు

స్వయం సహాయక సంఘాలకు భూములు, రుణాలు, రైస్ మిల్లులు, గోదాములు

Mahila Shakti Super Bazaars: స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్‌ తరహాలో ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున సూపర్ బజార్ల నిర్మాణానికి నామమాత్రపు లీజుపై స్థలాలు కేటాయించనున్నారు.

సోమవారం సచివాలయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మహిళలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు:

మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లులు, లాజిస్టిక్స్ హబ్‌లు, గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వ భూములు కేటాయిస్తాం. అవసరమైతే 20 నుంచి 100 ఎకరాల వరకు భూమి ఇవ్వడంతోపాటు సున్నా వడ్డీపై బ్యాంకు రుణాలు మంజూరు చేస్తాం.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్రను పెంచుతాం. భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం ఎవరి గోడౌన్లలోనూ నిల్వ ఉంచబోమని, మహిళా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేసి బియ్యం సరఫరా చేసే వ్యవస్థను తీసుకొస్తామన్నారు.

మహిళా సంఘాలు కార్పొరేట్ స్థాయిలో వ్యాపారాలు చేయాలని, అంబానీ-అదానీలతో పోటీ పడాలని సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు.

2034 నాటికి ఒక కోటి మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని పునరుద్ఘాటించారు.

మహిళల ఆర్థిక సాధికారత:

ప్రభుత్వం ఇప్పటికే మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించింది. వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. రాబోయే కాలంలో రుణాల మొత్తం రూ.1.25 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యం.

ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహిళా సంఘాలకు రెండున్నరేళ్లలోనే రూ.60 వేల కోట్లు అందించామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరలను కూడా ఆవిష్కరించి, పంపిణీ చేశారు.

Tags:    

Similar News