HYDRA in Ailapuram: ఐలాపురంలో హైడ్రా భారీ కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై స్టే లేదు: కమిషనర్ రంగనాథ్
అక్రమ నిర్మాణాలపై స్టే లేదు: కమిషనర్ రంగనాథ్
HYDRA in Ailapuram: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం గ్రామంలో హైడ్రా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ చర్యలు చేపట్టారు. ఐలాపురంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నివాసాలు వెలిశాయి. మిగిలి ఉన్న సుమారు 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ భూముల విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
1998 నుంచి హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా, దాన్ని పట్టించుకోకుండా ముఖీమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను ఆక్రమించి 2006లో ఫాంహౌస్ నిర్మించాడు. ఆ తర్వాత దాన్ని 40 ఎకరాలకు విస్తరించి, అనుచరులతో కలిసి 20 ఏళ్లుగా భూదందాలు చేశాడు. 100 గజాల ప్లాట్లను పేదలకు రూ.10 లక్షల చొప్పున అమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నాడు. అనుమతులు లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవనం, గెస్ట్ హౌస్‌లను హైడ్రా కూల్చివేసింది. అయితే గ్రామంలోని పేదల ఇళ్లు, తండాలకు మాత్రం హైడ్రా జోలికి వెళ్లలేదు. ఖాళీ స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటోంది.
ఈ కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. “ఐలాపురం భూములపై హైకోర్టు స్టేటస్ కో ఉంది. కానీ ముఖీమ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డాడు. కూల్చివేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు” అని రంగనాథ్ తెలిపారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో ముఖీమ్ నిర్మించిన ఆరంతస్తుల భవనం కూల్చివేయడంతో స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.