Ministers vs BRS Leaders: మంత్రులు vs బీఆర్‌ఎస్ నేతలు.. గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత!
గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత!
Ministers vs BRS Leaders: సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజధాని హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని ఆహ్వానించారు.
మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీశ్‌రావును వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
బీఆర్‌ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు: పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు. మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలందరికీ నిజం తెలియాలి. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపాం. నాలుగు శాఖల ఆధ్వర్యంలో టెండర్లు పిలిచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. పదేళ్లుగా మీరు చేసిన ప్రొక్యూర్‌మెంట్‌పై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.
మేం కూడా చర్చకు సిద్ధం: హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులతో చర్చించేందుకు అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరిన హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.
“హాస్టళ్లలో అవినీతి జరిగింది. అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్లే లెక్క. గన్‌పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తాం” అంటూ హరీశ్‌రావు ప్రకటించారు. కారు దిగి నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు ముందుకు కదిలే సమయంలో హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను సృష్టించాయి.