National SC Commission: కర్ల రాజేశ్ మృతి కేసులో అలసత్వం ఎందుకు?
అలసత్వం ఎందుకు?
అధికారుల తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం
పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
National SC Commission: దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి ఘటనలో అధికారుల పనితీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడకు సోమవారం వచ్చిన ఆయన, రాజేశ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన తల్లి లలితమ్మను పరామర్శించారు.
రాజేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని 58 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసినా ఎందుకు స్పందన లేదని రామచందర్ ప్రశ్నించారు. రాష్ట్ర అదనపు డీజీ డీఎస్ చౌహాన్, సూర్యాపేట ఎస్పీ నరసింహలను ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. పది రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేసులో సీఐని సస్పెండ్ చేసినా, ఎస్‌హెచ్‌వోను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాజేశ్ తల్లికి వారం రోజుల్లో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. కలెక్టర్ అందించిన పెన్షన్‌ను మృతుడి తల్లికి అందజేశారు.
కమిషన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని అదనపు డీజీ డీఎస్ చౌహాన్ తెలిపారు. రాజేశ్ మృతి విషయంలో నిజాయితీగల పోలీసు అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.