G. Kishan Reddy: పశ్చిమాసియా సంక్షోభంపై దుష్ప్రచారం: ప్రతిపక్షాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి - కిషన్ రెడ్డి ఫైర్

ప్రతిపక్షాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి - కిషన్ రెడ్డి ఫైర్

Update: 2026-03-13 11:32 GMT

G. Kishan Reddy: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు సంగుటితమవుతున్న నేపథ్యంలో భారతదేశం దృఢంగా, స్థిరంగా ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ సంక్షోభ సమయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి అండగా నిలబడి ధైర్యాన్ని నింపుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, దేశ స్థితిగతులపై ప్రతిపక్షాలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆరోపించారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, కాంగ్రెస్ నాయకుల అవినీతి, అధిక ధరలు, ఉగ్రవాదం, కుటుంబ పాలన కారణంగా భారత్ 'ఫ్రాజైల్-5' దేశాల జాబితాలో చేరిందని గుర్తుచేశారు. ఆ సమయంలో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇంధన వినియోగాన్ని 3 శాతం తగ్గించాలని, రాత్రిపూట పెట్రోల్ బంకులు మూసివేయాలని రాహుల్ గాంధీ సూచనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితుల్లోనే యూపీఏ ప్రభుత్వం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశం మరింత దారుణ స్థితికి చేరుకునేదని ఆయన వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కోసం ఉన్న సుమారు 90 లక్షల మంది భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, 'మల్టీ వెక్టార్ డిప్లొమసీ' విధానంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ప్రజలు, ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యతను మరచి ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం శోచనీయమని అన్నారు.

అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రైతులకు సమయానికి ఎరువుల సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు భారీగా పెరిగినా భారత్‌లో ధరలు పెంచకుండా నియంత్రించామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

Tags:    

Similar News