Bandi Sanjay: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి: బండి సంజయ్
బండి సంజయ్
Bandi Sanjay: దేశంలో మామిడికాయ తినాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బండి సంజయ్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రి పాలయ్యాను. 20 ఏళ్లలో నాకు ఎప్పుడూ జ్వరం రాలేదు. బీపీ, షుగర్ లేవు. నరేంద్ర మోదీయే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది. రోగాలకు కారకులం మనమే... వాటిని నివారించగలిగేది కూడా మనమే” అని అన్నారు.
ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,400 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే మొదటి రెండు-మూడేళ్లు లాభాలు రాకపోయినా, తర్వాత రైతులు కోటీశ్వరులవుతారని వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, రైతులు దీన్ని గమనించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు.
సేంద్రీయ సాగు ముందుగా కోటీశ్వరులు చేస్తుంది
ముందుగా సేంద్రీయ (ప్రకృతి) సాగు చేసేవారు కోటీశ్వరులు కావచ్చని బండి సంజయ్ అన్నారు. బడ్జెట్‌లో యూరియాకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, రూ.1.20 లక్షల కోట్లు విదేశాలకు పంపి యూరియా దిగుమతి చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలకు మద్దతు ధర ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
దేశ సంపదను విదేశాలకు పంపి ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తున్నామని, అందుకే ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని మోదీ ప్రభుత్వ విధానాలను వివరించారు.
రైతులకు పిలుపు: ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతాయని రైతులందరూ ఈ దిశగా అడుగులు వేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.