Kerala CM Pinarayi Vijayan: రేవంత్ సవాల్‌ను తిరస్కరించిన పినరయి: చర్చకు దిగే ఉద్దేశం లేదు!
చర్చకు దిగే ఉద్దేశం లేదు!
Kerala CM Pinarayi Vijayan: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వేసిన చర్చా సవాల్‌ను స్పష్టంగా తిరస్కరించారు కేరళ సీఎం పినరయి విజయన్. “రేవంత్‌తో చర్చకు దిగే ఉద్దేశం నాకు లేదు. తెలంగాణలో పార్టీలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వ పనితీరుపై అక్కడి ప్రజలే తీర్పు ఇవ్వాలి” అని స్పందించారు.
నీతి ఆయోగ్ 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సూచీలో కేరళ తొలి స్థానంలో ఉందని, ఇది ఏడు దశాబ్దాల ప్రభుత్వాల అన్నింటి కృషి ఫలితమని సోమవారం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఉందని గుర్తు చేస్తూ, “అందరి కష్టాన్ని సొంత ఖాతాలో వేసుకోవడం సరికాదు” అని హితవు చెప్పిన రేవంత్, పినరయికి చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఈ సవాల్‌పై తీవ్ర స్పందన వ్యక్తం చేసిన పినరయి విజయన్, తెలంగాణలోని స్థానిక పార్టీలే ఇలాంటి వివాదాలను చర్చించాలని, బయటి రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
“మీ హయాంలో ఏం చేశారో చూపించండి” – రేవంత్‌రెడ్డి కౌంటర్
ఇదే వ్యవహారంపై మరోసారి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం లేఖను గౌరవపూర్వకంగా స్వీకరించానని, కానీ పినరయి తక్కువ స్థాయి భాషను ఉపయోగించారని విమర్శించారు. “మీ అసహనపూరిత వ్యాఖ్యలకు నేను అదే రీతిలో స్పందించను. మీరు నా రాష్ట్రానికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేస్తానని మాట ఇస్తున్నా” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రేవంత్‌రెడ్డి మరింత వివరిస్తూ, నీతి ఆయోగ్ సూచిక డిసెంబర్ 2023తో ముగిసిన బీఆర్‌ఎస్ పదేళ్ల దుష్పరిపాలనను ప్రతిబింబిస్తుందని, తమ ప్రభుత్వం 28 నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. “2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.16.12 లక్షల కోట్లుగా ఉండి 10.7 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది జాతీయ సగటు 9.9 శాతం కంటే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలను అధిగమించి భారత్‌లోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేరళ ప్రజలకు మీ హయాంలో ఏం జరిగిందో చూపించండి” అని సవాల్ విసిరారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ వాగ్వాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.