Bharat Rashtra Samithi Leaders : అక్రమ మైనింగ్ కుంభకోణం.. మంత్రి పొంగులేటిని తక్షణం బర్తరఫ్ చేయాలి: భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

Update: 2026-03-30 10:41 GMT

Bharat Rashtra Samithi Leaders : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌లో పాల్పడుతున్నారని, ఆయనను తక్షణమే బర్తరఫ్ చేసి దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు.

ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేసిన నిరసనకారులు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి కుటుంబం చేస్తున్న కుంభకోణం బయటపెట్టేసరికి ప్రభుత్వం బిత్తరపోయిందని ఆరోపించారు.

“ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వాటా ఉందా? అందుకే చర్యలు తీసుకోవడం లేదా?” అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శించారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులదని, 2020-22 మధ్య కాలంలో పొంగులేటి ఛైర్మన్‌గా ఉన్నారని, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.

కోకాపేటలోని భాగ్యలక్ష్మి మైనింగ్ ముఖ్యమంత్రి బంధువులదని, మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం వచ్చాల్సి ఉండగా రూ.900 కోట్లు మాత్రమే వస్తున్నాయని, మిగతా డబ్బు ఎవరి జేబులోకి వెళ్తోందో ముఖ్యమంత్రి స్పష్టమైన జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజంగా వేల కోట్ల అవినీతి జరగకపోతే ఎందుకు సభను వాయిదా వేశారని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టుపై చేసిన ప్రకటన తప్పులతడకగా ఉందని, 280 ఎకరాల భూమిని ఎల్‌అండ్‌టీకి లీజుకు ఇచ్చి ఆ భూమిని కొట్టేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాయదుర్గం వద్ద మెట్రోకు కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోందని, ఎల్‌అండ్‌టీ సీఎఫ్‌ఓను జైల్లో వేస్తామని బెదిరించారని తెలిపారు. ఇది పెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు.

అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, కోవ లక్ష్మి, వివేకానంద్ గౌడ్, గంగుల కమలాకర్, కాలేరు వెంకటేశ్, సునీతా లక్ష్మి రెడ్డి తదితరులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాదయాత్రగా అసెంబ్లీ వైపు బయలుదేరారు.

Tags:    

Similar News