CM Revanth Reddy: మెరిట్ ఆధారంగా మాత్రమే పదవులు.. కాంగ్రెస్‌లో లిస్టులకు చోటు లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌లో లిస్టులకు చోటు లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2026-02-21 13:57 GMT

CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే సంస్కృతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భిన్నమైన అభిప్రాయాలు చెప్పినందుకు ఎవరినీ వేధించే సంప్రదాయం పార్టీలో లేదని స్పష్టం చేశారు. పార్టీలోని నేతలు పరస్పరం కలహాలు పెట్టుకుంటే, పార్టీ కోసం కష్టపడుతున్న లక్షలాది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత, ప్రజలతో మెరుగైన అనుసంధానం లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చరిత్ర, నాయకుల త్యాగాలను గుర్తుచేశారు.

మోతీలాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం రూ.వేల కోట్ల ఆస్తిని త్యాగం చేశారని, జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపారని రేవంత్ రెడ్డి వివరించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు సమర్పించారని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య రోజుల తరబడి ఉండి వారి బాధలు తెలుసుకున్నారని గుర్తుచేశారు.

తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్టీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలోని కొందరు నేతల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, అందరినీ కలిసి తన ఆలోచనలు వివరించి ఒప్పించానని చెప్పారు. అందరూ కలిసి కృషి చేయడంతో పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు అందజేశామని, టికెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా, పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు కట్టబెట్టామని పేర్కొన్నారు.

పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెరిట్ ఉన్నవారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఎలాంటి లిస్టులకు చోటు లేదని, కేవలం మెరిట్ లిస్టు ఆధారంగానే అవకాశాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఎంతో విలువైందని, వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. డీసీసీ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా లేదా సీఎంగా కూడా ఎదగవచ్చని ఆయన ప్రోత్సహించారు.

Tags:    

Similar News