Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు: అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు
నామినేషన్లు దాఖలు
Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వీరిద్దరూ అభ్యర్థిత్వ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసెంబ్లీ ప్రాంగణంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లతో సహా పార్టీ అగ్రనేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, రాజ్యసభ అభ్యర్థిత్వం కల్పించినందుకు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపిన వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత సలహాదారుగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం మొదట అభిషేక్ మను సింఘ్వీ పేరును ఖరారు చేసింది. ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే అంశంపై రాత్రంతా చర్చలు, సంప్రదింపులు జరిగాయి. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన సిఫార్సుతో, అందరి సమ్మతితో వేం నరేందర్ రెడ్డి పేరు ఫైనల్ అయింది.
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రంగంలోకి దిగకపోతే రెండు సీట్లూ కాంగ్రెస్‌కు ఏకగ్రీవంగా దక్కే అవకాశం ఉంది. మొదటి సీటుకు అభిషేక్ సింఘ్వీ ఎన్నిక సునాయాసంగా జరుగుతుంది. రెండో సీటుకు మెజారిటీ కాంగ్రెస్‌కు లేకపోవడంతో ఎంఐఎం మద్దతు అవసరమవుతుంది. అయితే పోటీ లేకపోతే ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.