CM Revanth Reddy: ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం – ఎలివేటెడ్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి
ఎలివేటెడ్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి
CM Revanth Reddy: ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్లను క్యూర్, ప్యూర్, రేర్‌లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. శాసన మండలిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
ఆదాయాలు పెరగడంతో ప్రతి కుటుంబంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయని సీఎం తెలిపారు. దీనిని అధిగమించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణలు చేపట్టామన్నారు. నగరంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించి ట్రాఫిక్ ఎక్కడా ఆగకుండా చూసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో కేంద్ర నిబంధనల ప్రకారం రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిని మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని పేర్కొన్నారు. నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరగడంతో శామీర్‌పేట్, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి భూమి సేకరణ చేస్తున్నామన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు ఇబ్బందులు ఉన్నాయని, సిగ్నల్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తామని, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మల్టీ లెవల్ కారు పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అభివృద్ధి విషయంలో అన్ని పార్టీల నేతలూ ఏకమై ఉండాలని సీఎం కోరారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఢిల్లీలాంటి కాలుష్య సమస్యలు రావచ్చని హెచ్చరించారు. ఓఆర్‌ఆర్ లోపల రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని, దూరాలు తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు వేస్తున్నామని చెప్పారు. ఇవి సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు అనుసంధానమవుతాయని, దీంతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని ఆయన అన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను మార్చడం వల్ల మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, క్యూర్‌లో సర్వీస్ సెక్టార్, ప్యూర్‌లో ఇండస్ట్రియల్ సెక్టార్, రేర్‌లో అగ్రికల్చర్ సెక్టార్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గుజరాత్ అభివృద్ధిలో భాజపాకు కాంగ్రెస్ పూర్తి సహకారం అందించినట్లే, ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి నగర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.