Ponnam Prabhakar: రాహుల్‌ను ప్రధానిగా చూడటం మా హక్కు.. బండి సంజయ్‌కు నిర్ణయాధికారం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

బండి సంజయ్‌కు నిర్ణయాధికారం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2026-03-05 10:00 GMT


Ponnam Prabhakar: కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం తమ హక్కని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయించే అధికారం బండి సంజయ్‌కు లేదని, అది ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి "ప్రధాని పదవి వారసత్వంగా రాదు" అని చేసిన వ్యాఖ్యలపై బుధవారం పొన్నం స్పందించారు. "ఒక రాజకీయ పార్టీగా రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకోవడం మా హక్కు. ప్రజాస్వామ్యంలో నాయకత్వ ఎన్నిక బండి సంజయ్ నిర్ణయించేది కాదు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు" అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టినవారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమిటి? మీరు అధికారంలోకి వచ్చాక పరిపాలనా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారు. నిత్యం మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారు" అని పొన్నం విమర్శించారు.

రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి, ప్రస్తుత ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారని, ఆయన్ని విమర్శించడం అవివేకమని మంత్రి అన్నారు. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News