Seethakka: క్రెచ్ వర్కర్ల వేతనాల పెంపుపై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసిన సీతక్క
కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసిన సీతక్క
Seethakka: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. సీతక్క శనివారం ఢిల్లీలో కేంద్ర మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిశారు. ఈ భేటీలో మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
నిర్భయ నిధి కింద దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంచుకోవడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల సాయంతో ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచాలని భావిస్తున్నామని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేస్తున్నామని, రాష్ట్ర మహిళా & శిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తుందని సీతక్క స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ పథకం కింద పనిచేసే క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కోరారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని, ఇది వారు చేసే పనికి, బాధ్యతలకు ఏమాత్రం సరిపోలేదని ఆమె వాదించారు. వేతనాల పెంపు ద్వారా ఈ కార్యకర్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని సీతక్క విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీ మహిళా & శిశు సంక్షేమ రంగంలో రాష్ట్ర-కేంద్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశంగా మారింది.