ఎల్లో మీడియా డైరెక్షన్‌ లో సిట్ దర్యాప్తు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్;

Update: 2025-07-24 11:47 GMT
  • చంద్రబాబు చెప్పిన వారిపై ప్లాన్ ప్రకారం విషం చిమ్మే కథనాలు
  • ఆ కథనాల ప్రకారమే కేసులు నమోదు చేస్తున్న సిట్
  • కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు సిట్ ద‌గ్గ‌ర ఆధారాలే లేవు
  • వైయ‌స్ జ‌గ‌న్‌ని రాజ‌కీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్ర‌లు
  • స్ప‌ష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్‌లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్‌కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్‌లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్‌ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి వైయస్ఆర్‌సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్‌లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్‌ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్క‌ర్ కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు స‌మ‌ర్పించ‌కుండానే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా క‌థ‌నాలు ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి. జ‌డ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముంద‌రే ఈ రెండు పేప‌ర్ల‌కి ఎలా లీక‌వుతోంది.? ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో ఎవ‌రి మీద‌నైతే వార్త‌లు రాస్తున్నారో సిట్ వారి మీద‌నే కేసులు న‌మోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పిన‌ట్టు సిట్ న‌డుస్తుందా అనే అనుమానాలు క‌ల‌గకుండా ఉండ‌వు. సిట్ కి విశ్వ‌స‌నీయత లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్‌ల నిండా వేల కోట్ల డ‌బ్బులు దాచిపెట్టార‌ని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్ల‌లో డిబేట్లు న‌డుపుతున్నారు. త‌ప్పుడు క‌థ‌నాలు రాసి విష ప్ర‌చారం చేస్తున్నారే కానీ, ఎక్క‌డా అంత పెద్ద మొత్తంలో సిట్ డ‌బ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ప్పుడు రూ.50 వేల కోట్ల లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఆ విలువ‌ను రూ. 3,500 కోట్ల‌కు త‌గ్గించుకుంటూ వచ్చారు. న్యాయ‌ప‌రంగా ప్ర‌భుత్వ అరాచకాల‌ను ఎండ‌గ‌ట్టే ఏ అవ‌కాశాన్ని మేం వ‌దులుకోం. ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీస్తాం. కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.

డిస్టిల‌రీన్నీ చంద్ర‌బాబు అనుమ‌తుల‌తో ఏర్పాటైన‌వే

డిస్టిల‌రీల నుంచి క‌మీష‌న్లు తీసుకున్నార‌నేది సిట్ చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ. కానీ వాస్త‌వంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిల‌రీల‌న్నీ చంద్ర‌బాబు అనుమ‌తులిచ్చిన‌వే. వైయ‌స్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వ‌లేదు. కొంత‌మంది అధికారుల‌ను లోబ‌ర్చుకుని, బెదిరించి, భ‌య‌పెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు న‌మోదు చేశారు. లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెప్ప‌డానికి సిట్ వ‌ద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయ‌స్సార్సీపీని ఇబ్బంది పెట్టాల‌న్న ఉద్దేశ్యంతోనే క‌క్ష‌పూరితంగా లిక్క‌ర్ కేసును సృష్టించారు.

రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు

నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబ‌స్తు క‌ల్పించాల‌ని కోర్టు స్ప‌ష్టంగా చెప్పినా పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పోలీసులు య‌థేచ్చ‌గా చ‌ట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి కూట‌మి నాయ‌కుల అరాచ‌కాల‌కు స‌హ‌క‌రిస్తున్న పోలీసులు, ప్ర‌భుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వైయ‌స్సార్సీపీని ఎంత అణ‌గ‌దొక్కాల‌ని చూస్తే అంత‌కు మూడింత‌లు బ‌లంగా తిర‌గ‌బ‌డ‌తాం. వైయ‌స్సార్సీపీకి పోరాటాలు కొత్త‌కాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొద‌లైంది.

ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయారు

త‌న‌కు పాల‌న చేత‌కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చెప్పేశాడు. ఏదైనా అల‌జ‌డి సృష్టించి వైయ‌స్సార్సీపీ మీద బుర‌ద జ‌ల్ల‌డానికే చంద్ర‌బాబు ఆయ‌న్ను వాడుకుంటున్నాడు. ఆయ‌న‌కున్న సినిమా క్రేజ్‌ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో ల‌బ్ధిపొందింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌లం, బ‌ల‌హీన‌త జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తిగా అర్థ‌మైంది. రాబోయే రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ జీరో కావ‌డం త‌థ్యం. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్య‌మయ్యార‌ని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉంద‌ని ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మా ప్ర‌భుత్వ హ‌యాంలో న‌మోదైన కేసును కూట‌మి ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. దీనిపై క్రిమిన‌ల్ రివిజ‌న్ పిటిష‌న్ వేసి న్యాయ‌స్థానాల్లో పోరాడుతున్నాం.

Tags:    

Similar News