Strike Alert in Telangana State Road Transport Corporation: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్: డిమాండ్లు నెరవేర్చకపోతే 22 నుంచి ఉద్యమం
డిమాండ్లు నెరవేర్చకపోతే 22 నుంచి ఉద్యమం
Strike Alert in Telangana State Road Transport Corporation: తెలంగాణ రాష్ట్ర రోడ్డు సార్వజనిక రవాణా సంస్థ (TGSRTC)లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. 21వ తేదీ అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపేసి, 22వ తేదీ తెల్లవారుజాము నుంచి పూర్తి సమ్మెలోకి వెళ్లనున్నట్టు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికశాఖ జంట నగరాల జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్ మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆర్టీసీ అధికారులు చర్చలకు హాజరు కాలేదని, యాజమాన్యం నుంచి ఒక లేఖ మాత్రమే వచ్చిందని జేఏసీ నేతలు తెలిపారు. ఆ లేఖలో ‘కార్మికుల సమస్యలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, తమ పరిధిలో లేవు’ అని పేర్కొన్నారని వారు ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం సహా మొత్తం 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్లనున్నట్టు జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, “కార్మికుల సమస్యలపై పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బలవంతంగా సమ్మెలోకి నెట్టేస్తోంది” అని అన్నారు.
ఏప్రిల్ 9న కార్మిక శాఖతో చర్చలకు ఆహ్వానించినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా వారు తెలిపారు.
ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్ వెంకన్నతో పాటు మౌలానా, యాదగిరి, థామస్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం త్వరిత చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో 22 నుంచి పూర్తి సమ్మెతో పాటు తీవ్ర ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.