Telangana Chief Minister A. Revanth Reddy: అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభం: హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీపడాలి
హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీపడాలి
Telangana Chief Minister A. Revanth Reddy: తెలుగు సినీ పరిశ్రమ పక్కనున్న ప్రాంతీయ సినీరంగాలతో పాటు హాలీవుడ్‌తో పోటీపడాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హాలీవుడ్ సినిమాలు కేవలం చూడటమే కాకుండా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిగేలా చేయాలని, దీనికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.
కోకాపేటలో నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, చిన్నప్పటి నుంచి తాను సినిమా అభిమానినని, సినీరంగంలో జరిగిన అనేక విప్లవాత్మక మార్పులను గమనించానని తెలిపారు.
అధునాతన సాంకేతికతతో తయారైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలంటే సరైన థియేటర్లు అవసరమని, ఇంత పెద్ద థియేటర్ ఇటీవల కాలంలో చూడలేదని పేర్కొన్నారు. తెలుగు సినీనటులు అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించారని, సూపర్‌స్టార్ కృష్ణ ఏడాదికి 15 సినిమాల వరకు విడుదల చేసేవారని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా ఆయన అభిమానినని చెప్పుకున్నారు.
తన చదువు రోజుల్లో వనపర్తి నుంచి లారీలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్నూలులో సినిమాలు చూసేవారని, సినిమాలు మధ్యతరగతి వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీరంగాన్ని కూడా ప్రోత్సహిస్తోందని తెలిపారు. అల్లు అరవింద్ హైదరాబాద్‌లో ఇలాంటి అద్భుత థియేటర్‌ను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాకుండా హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, డాల్బీ విజన్ కొత్త తరానికి చెందిన సాంకేతికత అని, ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చిందని తెలిపారు. వినోద రంగంలో నగరాన్ని ప్రపంచ స్థాయిలో ప్రత్యేకంగా నిలపాలని ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను సినీరంగ రాజధానిగా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ‘వారానికి 14 రోజులు’ పనిచేస్తున్నారని ప్రశంసించారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్లు ఉండగా, ఒకటి ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ విజన్ స్క్రీన్‌గా ప్రత్యేకత సాధించింది. ఉగాది సందర్భంగా సినిమాల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి.