Telangana State Gross Domestic Product (GSDP): జాతీయ సగటును దాటిన తెలంగాణ వృద్ధి – జీఎస్‌డీపీ 10.7% నమోదు
జీఎస్‌డీపీ 10.7% నమోదు
Telangana State Gross Domestic Product (GSDP): తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 2025-26 సంవత్సరానికి 10.7 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు 8 శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2026 ప్రకారం గతేడాది జీఎస్‌డీపీ విలువ రూ.16.09 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.17.82 లక్షల కోట్లకు చేరుకుంది.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.87 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగింది. జాతీయ, రాష్ట్ర గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్‌వీఏ)లో సేవారంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఐటీ, ట్రేడ్, రవాణా, కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, ఇతర ప్రొఫెషనల్ సేవల రంగాల్లో బలమైన వృద్ధితో సేవారంగం వాటా అధికంగా ఉంది. ఈ ఏడాది తెలంగాణలో సేవారంగం వాటా 68.6 శాతం కాగా, జాతీయ సగటు 56.4 శాతమే.
గతేడాదితో పోలిస్తే జాతీయ సగటు కంటే ఎక్కువగా ప్రాథమిక రంగం 1.4 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం, సేవారంగం 13.5 శాతం వృద్ధి సాధించింది. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, మైనింగ్, క్వారీయింగ్ ఉన్నప్పటికీ పశుసంపద 41.4 శాతంతో అగ్రస్థానంలో ఉంది. పంట ఉత్పాదకత 38.2 శాతంతో రెండో స్థానంలో ఉంది.
జిల్లా స్థూల జాతీయోత్పత్తి (జీడీడీపీ)లో రంగారెడ్డి జిల్లా తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ప్రధాన ఐటీ పార్కులు, ఫార్మా, బయోటెక్నాలజీ, పారిశ్రామిక పార్కులు, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ ఎక్కువగా ఉండటంతో ఈ జిల్లాల్లో ఉత్పాదక విలువ అధికంగా ఉంది.
అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.