Top Maoist Leader Devji : మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు: పార్టీకి భారీ ఎదురుదెబ్బ

పార్టీకి భారీ ఎదురుదెబ్బ

Update: 2026-02-23 04:37 GMT

మావోయిస్టు పార్టీకి భారీ షాక్!

Top Maoist Leader Devji : పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతోపాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ ఎలియాస్ మీసాల సత్తన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి ఎలియాస్ గంగన్న కూడా ఇదే దారిని ఎంచుకున్నారు. వీరితో సహా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) మరియు ఇతర క్యాడర్‌కు చెందిన 40-50 మంది వరకు పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

దేవ్‌జీ జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేడ్కర్‌నగర్ వాసి. సంగ్రామ్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రుల్లపల్లెకు చెందినవాడు. గంగన్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వల్లూరు నివాసి. వారం పది రోజుల క్రితమే మధ్యవర్తుల ద్వారా తెలంగాణ నిఘా విభాగంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ చర్చలు సఫలమవ్వడంతో ఆదివారం ఉదయం కేంద్ర నిఘా వర్గాలకు తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ దేవ్‌జీ, సంగ్రామ్ లొంగిపోయారని బహిరంగంగా వెల్లడించారు. అయితే, తెలంగాణ పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ లొంగుబాటుపై స్పష్టత లేదు.

ఆపరేషన్ కగార్ ప్రభావం

1980లలో కొండపల్లి సీతారామయ్య (కేఎస్) నేతృత్వంలో సీపీఐ-పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది. కొన్ని సంవత్సరాల తర్వాత కేఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. ఆయన స్థానంలో ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఎలియాస్ గణపతి సారథ్యం వహించారు. మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత కూడా ఆయనే చీఫ్‌గా కొనసాగారు. ప్రస్తుతం గణపతి ఆచూకీపై స్పష్టత లేదు. నేపాల్ మార్గంగా విదేశాలకు వెళ్లి ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వయోభారం కారణంగా 2018లో గణపతి తప్పుకుని నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజు (బీఆర్)కు బాధ్యతలు అప్పగించారు. గతేడాది మే 21న ఎన్‌కౌంటర్‌లో బీఆర్ మృతిచెందారు. అనంతరం పార్టీకి ముఖ్యమైన నాయకుడిగా దేవ్‌జీ వ్యవహరించారు. ఆపరేషన్ కగార్ తీవ్రరూపం దాల్చడంతోనే ఈ లొంగుబాటు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కార్యకలాపాల అణచివేతలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) గతంలో అనేక ఆపరేషన్లు చేపట్టినా, చీఫ్‌ను లొంగిపోయేలా చేయడం ఇది చరిత్రాత్మకమైనది.

మావోయిస్టు ఉద్యమం చరమాంకంలో

పార్టీ చీఫ్ లొంగిపోవడంతో నాలుగున్నర దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. గణపతి, మిసిర్ బెస్రా, పసునూరి నరహరి వంటి ఒకరిద్దరు అగ్రనేతలు మాత్రమే మిగిలారు. వారు కూడా క్యాడర్‌కు సరైన దిశానిర్దేశం చేయలేని స్థితిలో ఉన్నారు. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ)తో కలిసి సీపీఐ-మావోయిస్టుగా మారిన సమయంలో 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, 20 వేలకు పైగా పీఎల్‌జీఏ సైన్యంతో విస్తరించింది పార్టీ. కానీ, క్రమంగా ప్రభావం కోల్పోతూ వచ్చింది. 2024లో ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర బలగాలు అబూజ్‌మడ్ అడవుల్లోకి చొచ్చుకెళ్లడంతో ఏడాదిన్నరలోనే పార్టీ దెబ్బతిన్నది. గతేడాది బీఆర్ మృతితోపాటు పది మందికి పైగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో పార్టీ కోలుకోలేకపోయింది. దేవ్‌జీ లొంగుబాటుతో మావోయిస్టు శకం ముగిసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News