Mohammad Azharuddin: ఎమ్మెల్సీ నియామకంపై అనిశ్చితి – మంత్రి పదవిపై అజారుద్దీన్‌ భవిష్యత్తు సందిగ్ధం

మంత్రి పదవిపై అజారుద్దీన్‌ భవిష్యత్తు సందిగ్ధం

Update: 2026-03-20 11:49 GMT

Mohammad Azharuddin: ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్‌ ఆమోదం ఇంకా లభించకపోవడంతో మంత్రి అజారుద్దీన్‌ పరిస్థితి డోలాయమానంగా మారింది. ఏ సభలోనూ సభ్యుడు కాని ఆయన్ను జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ముందుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఏప్రిల్‌ ఆఖరుతో ఈ గడువు ముగుస్తుంది.

ఎమ్మెల్సీగా అజారుద్దీన్‌ పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినా ఇంకా గవర్నర్‌ ఆమోదించలేదు. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకముందే, తెలంగాణ జన సమితి (తెజస్) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంతోపాటు అమేర్‌ అలీఖాన్‌ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయడానికి గవర్నర్‌కు పంపడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు పడిన నేపథ్యంలో మళ్లీ ప్రతిపాదనలు పంపాల్సి వచ్చింది.

రెండోసారి కోదండరాంతోపాటు అజారుద్దీన్‌ పేరును సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కారణంగా నిర్ణయం తీసుకోకుండా గవర్నర్‌ దీనిని పెండింగ్‌లో పెట్టారు. గత నెల 3న దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు... గవర్నర్‌ నిర్ణయం తీసుకోవచ్చని, తమ తీర్పు అడ్డంకేమీ కాదని పేర్కొంది. దీంతో ఇద్దరికీ ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

కానీ, అలా జరగకపోవడంతో ప్రభుత్వంలోని ముఖ్యులు అప్పటి గవర్నర్‌ను కలిసి చర్చించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు గడువు దగ్గరపడుతుండటంతో అజారుద్దీన్‌ భవిష్యత్తు ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ నియామకం ఆలస్యమవుతుండటం వల్ల మంత్రి పదవి కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.

Tags:    

Similar News