Minister Ponguleti:  రాష్ట్రంలోని సామాన్యుల ఆస్తుల రక్షణ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిషేధిత జాబితా (22ఏ)లో చేరిన ప్రైవేటు భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే పరిష్కార ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.

మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఇలా అన్నారు: ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో భూములను నమోదు చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో సాంకేతిక పొరపాట్లు జరిగాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతోంది. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించాం. రెవెన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. 15 రోజులపాటు ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తుంది.’’

భారాస నేత హరీశ్‌రావు ప్రజల సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మంత్రి విమర్శించారు. ‘‘విమర్శలు చేయడం సులువు.. బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ విషయంలో పొరపాటును బహిరంగంగా అంగీకరించి సరిచేస్తున్నాం. పదేళ్ల భారాస పాలనలో ధరణిలో అనేక తప్పులు జరిగాయి. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఏనాడైనా ఆ తప్పులకు బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా? తప్పులను అంగీకరించే ధైర్యం ఉందా?’’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత పరిణామాలపైనా హరీశ్‌రావు బాధ్యత తీసుకోలేదని పేర్కొన్నారు. తాను క్షేత్రస్థాయి పొరపాట్లను గుర్తించి పరిష్కారం చూపుతున్నానని, అందులోనే తేడా ఉందని అన్నారు.

భాజపా నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘నాపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలి. నేను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నాను. ఒక్కరోజులో వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదు’’ అని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి, పేదలకు ఒక్కో సిమెంట్ బస్తా రూ.230కే అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 85 శాతం శ్లాబులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఈ బృహత్తర పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరారు.

Tags: