CPM Leaders: ఇరాన్‌పై దాడులను మోదీ ఎందుకు ఖండించడం లేదు?: సీపీఎం నాయకుల ఆరోపణ
సీపీఎం నాయకుల ఆరోపణ
CPM Leaders: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించకపోవడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అరుణ్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. భారత్‌కు ఇరాన్ దీర్ఘకాల మిత్రదేశమని, అక్కడి నుంచి చమురును చౌక ధరలకు దిగుమతి చేసుకుంటున్నామని ఆయన గుర్తుచేశారు. మిత్రదేశంపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దేశ విదేశాంగ విధానంలో వస్తున్న మార్పులకు సూచిక అని అరుణ్‌కుమార్ అన్నారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, మోదీ ఎందుకు అమెరికా ముందు మోకరిల్లుతున్నారని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ పేరుతో లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.
సమావేశంలో మాట్లాడిన జాన్‌వెస్లీ, కేరళ ఎన్నికల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను తరలిస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో పేదలు కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని విమర్శించారు.
అయితే, పార్టీలోని కొన్ని అంతర్గత విషయాలపై చర్చలు జరుగుతాయని, వాటిని బయటపెట్టాల్సిన అవసరం లేదని బీవీ రాఘవులు స్పష్టం చేశారు. అవి సమీక్షించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్ర ముఖ్య నేత తమ్మినేని వీరభద్రం సమావేశానికి హాజరు కాకపోవడంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు పంథా మార్చుకుని ప్రజాజీవితంలోకి రావడం మంచి పరిణామమని కూడా అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య, నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.