Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు: దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేయకూడదు-తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన పోస్టులో ఇలా వ్యాఖ్యానించారు: ‘‘లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు రెండూ వేర్వేరు అంశాలు. ప్రతి పౌరుడికీ ఇది తెలుసు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుంది. కానీ మహిళా రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని భాజపా చూస్తోంది. ఈ విధానం దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. భవిష్యత్‌లో దేశాన్ని బలహీనపరుస్తుంది. ఏ పార్టీ అయినా జాతీయ ప్రయోజనాలనే ముందుంచాలి.’’
మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన అధినియమ్)ను కాంగ్రెస్ పార్టీ బలంగా సమర్థిస్తుందని, మహిళల సాధికారత కోసం ఇలాంటి చట్టాలు తీసుకురావడం కాంగ్రెస్ సంప్రదాయమని రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అయితే, లోక్‌సభ సీట్ల పెంపు (డీలిమిటేషన్) విషయంలో దక్షిణ రాష్ట్రాల స్థానం దెబ్బతినకుండా చూడాలని ఆయన ఒత్తిడి చేశారు.
ఈ అంశంపై రాజకీయ పక్షాల మధ్య చర్చలు త్వరలో మొదలవుతాయని, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరగాలని సీఎం సూచించారు.