AP BJP President : ఆక్వా రైతుల సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లా
ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్;
ట్రంప్ టారిఫ్‌ల కారణంగా ఆక్వా రైతులకు కలిగే ఇబ్బందులను ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వెళ్లానని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయని మాధవ్ చెప్పారు. అక్వా రైతులకు ప్రస్తుతం నష్టం జరుగుతోందని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ప్రధాని హామీ ఇచ్చినట్లు మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళినన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అభివృద్ధికి సిద్దం చేసుకున్న రోడ్ మ్యాప్‌ని ప్రధానికి వివరించినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహించాలని ప్రధాని సూచించారని చెప్పారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మా పార్టీ మద్దతు ఉండదని మాధవ్ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మద్దతు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలకు భూ కేటాయింపుల విషయంలో ఒక విధానం ఉందని ఆ విధానం ప్రకారమే భూకేటాయింపులు జరుగుతాయని ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.