Pawan Kalyan: యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
Pawan Kalyan: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ దైనందిన జీవితంలో యోగాను ఒక అనివార్య భాగంగా చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. యోగా కేవలం భారతీయ నాగరికత, సంస్కృతికి మాత్రమే కాకుండా, ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన కానుక అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.
చిన్న వయసు నుంచే యోగా సాధన ప్రారంభించానని, అనేక సందేహాలు, ప్రశ్నలతో నిండిన మనసుకు యోగా సమాధానాలు మాత్రమే కాకుండా లోతైన స్పష్టత, అంతర్గత పరిణతిని అందించిందని పవన్‌కల్యాణ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ అనుభవాలు తన జీవిత ప్రయాణాన్ని బాగా ప్రభావితం చేశాయని చెప్పారు. క్రియా యోగ, అష్టాంగ యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందించే సుదర్శన క్రియ వంటి సాధనలు ఇప్పటికీ తన రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
అదే సమయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, ఇతర న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగా నిపుణుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు సాధన చేశారు. న్యాయమూర్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, సమతుల్య జీవన విధానానికి దోహదపడుతుందని ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడానికి ఉపకరిస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.