Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త రారాజు: 750cc కాంటినెంటల్ GT-R 750 వచ్చేస్తోంది
750cc కాంటినెంటల్ GT-R 750 వచ్చేస్తోంది;
Royal Enfield : భారత మార్కెట్లో క్రూజర్ బైకులంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్. దశాబ్దాలుగా ఈ సెగ్మెంట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు మరో పెద్ద అడుగు వేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వంటి 650సీసీ బైకులతో భారత, అంతర్జాతీయ మార్కెట్లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు కంపెనీ ఒక అడుగు ముందుకు వేసి, త్వరలో 750cc ఇంజిన్తో సరికొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఇటీవల మన దేశంలోనే కాంటినెంటల్ GT-R 750 అనే బైక్ టెస్టింగ్ జరుగుతుండగా కనిపించింది. ఇదే కొత్త 750సీసీ ఇంజిన్ ఇంటర్‌సెప్టర్ మోడల్‌లో కూడా ఉండబోతోందని తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ సెగ్మెంట్‌లో తొలిసారిగా కాంటినెంటల్ GT-R రూపంలో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్పై ఫోటోల ద్వారా ఈ బైక్ డిజైన్ వివరాలు బయటపడ్డాయి. ఇది ఇప్పటివరకు వచ్చిన కాంటినెంటల్ GT మోడల్స్‌లోకెల్లా అత్యంత స్పోర్టీ, పవర్ ఫుల్ బైక్‌గా ఉండబోతోందని అంచనా. ఇది పూర్తిగా ఒక కేఫ్ రేసర్ స్టైల్ బైక్. రైడింగ్ పొజిషన్ కొద్దిగా వంగి ఉండేలా, ఫుట్‌పెగ్‌లు వెనుకకు వంగి ఉండేలా డిజైన్ చేశారు. వెనుక వైపు రెట్రో స్టైల్‌లో గుండ్రని ఇండికేటర్లు, క్రోమ్ ఫినిషింగ్ ఆకట్టుకుంటున్నాయి. టెస్టింగ్ పరికరాలు వెనుక భాగంలో అమర్చినందున సీటు భాగం స్పష్టంగా కనిపించలేదు.
ఈ సరికొత్త బైక్ పూర్తిగా ఒక కొత్త ప్లాట్‌ఫామ్ మీద నిర్మితమైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఇదివరకెన్నడూ లేని విధంగా, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్, క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన రెండు ఎగ్జాస్ట్‌లు ఉన్నాయి, ఇవి GT 650 మాదిరిగానే కనిపిస్తున్నాయి. టెస్టింగ్ సమయంలో బైక్ పూర్తిగా కవర్‌తో కప్పబడి ఉన్నందున మరిన్ని వివరాలు స్పష్టంగా కనిపించలేదు. అయితే, ఇందులో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు కాయిల్ సస్పెన్షన్ ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు కూడా ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ కొత్త బైక్‌లో 750సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న 650సీసీ ఇంజిన్ డిజైన్ ఆధారంగా రూపొందించారు. అయితే మెరుగైన పనితీరు కోసం దీనిని మరింత పెద్దదిగా చేశారు. ప్రస్తుతం ఉన్న 650సీసీ ఇంజిన్ 46.3 bhp పవర్, 52.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త 750సీసీ కాంటినెంటల్ GTని నవంబర్ నెలలో ఇటలీలోని మిలన్ నగరంలో జరిగే EICMA టూ-వీలర్ ఈవెంట్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక భారత మార్కెట్లో దీని లాంచింగ్ 2026 మొదటి ఆరు నెలల్లో ఉండవచ్చు.