Harley-Davidson X440 T vs Royal Enfield Classic 350:రెండు రెట్రో బైక్‌ల మధ్య అసలు సిసలు పోరు..హార్లే X440 T లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఏది బెస్ట్?

హార్లే X440 T లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఏది బెస్ట్?

Update: 2025-12-09 05:42 GMT

Harley-Davidson X440 T vs Royal Enfield Classic 350: హార్లే-డేవిడ్‌సన్ భారత మార్కెట్‌లో తన కొత్త బైక్ X440 Tని లాంచ్ చేయడంతో 400cc బైక్ సెగ్మెంట్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ఈ సెగ్మెంట్‌లో చాలా సంవత్సరాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. లుక్ పరంగా చూస్తే, ఈ రెండు బైక్‌లు రెట్రో డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, వాటి స్టైలింగ్ మాత్రం భిన్నంగా ఉంటుంది. క్లాసిక్ 350 చాలా పాత, సింపుల్ డిజైన్‌తో ఉంటే, హార్లే X440 T రెట్రో లుక్‌లో కూడా కొత్త ఫీచర్లు, మోడరన్ టచ్‌తో మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

ధర విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 చాలా మంది రైడర్ల బడ్జెట్‌కు అందుబాటులో ఉంది. హార్లే X440 T బైక్ ప్రారంభ ధర రూ.2.79 లక్షలుగా ఉంది. క్లాసిక్ 350 ధర దీని కంటే తక్కువగా ఉంటుంది. రెండు బైక్‌ల టాప్ మోడల్‌లను పోల్చి చూస్తే, హార్లే X440 T సుమారు రూ.63,000 వరకు ఖరీదైనది. హార్లే X440 T ని కంపెనీ ఒక ప్రీమియం బైక్గా మార్కెట్‌లోకి తెచ్చింది, కాబట్టి ధర ఎక్కువగా ఉంది. అయితే, క్లాసిక్ 350 తన సరసమైన ధర, సాధారణ డిజైన్ కారణంగా ఎక్కువ మంది రైడర్లకు నచ్చిన బైక్‌గా నిలిచింది.

పవర్‌ట్రైన్ పరంగా హార్లే స్పష్టంగా మెరుగ్గా ఉంది. హార్లే X440 Tలో 440cc ఇంజన్ ఉంది, ఇది 27 hp పవర్, 38 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. తక్కువ RPM వద్ద కూడా మంచి టార్క్ లభించడం వలన, హైవేలపై ఇది చాలా స్మూత్‌గా, వేగంగా, పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. క్లాసిక్ 350లో 349cc ఇంజన్ ఉంది, ఇది 20.2 hp పవర్, 27 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగినా, హైవేలపై హార్లే అంత వేగంగా, శక్తివంతంగా అనిపించదు.

హార్లే X440 T ముందు భాగంలో సాధారణంగా స్పోర్ట్స్ బైక్‌లలో ఉండే 43mm USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు లభించాయి. దీనివల్ల బైక్ చాలా స్థిరంగా ఉంటుంది. బ్రేకింగ్ సమయంలో మెరుగైన కంట్రోల్ లభిస్తుంది. దీని వెడల్పాటి టైర్లు హైవేపై మంచి పట్టునిస్తాయి. క్లాసిక్ 350లో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లు ఉన్నాయి, ఇది బేసిక్ సెటప్.

రెండు బైక్‌ల బరువు దాదాపు సమానంగా ఉంది – క్లాసిక్ 350 బరువు 195 కిలోలు, హార్లే X440 T బరువు 192 కిలోలు. అందువల్ల రెండు బైక్‌లు రోడ్డుపై పటిష్టంగా, స్థిరంగా అనిపిస్తాయి. టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో హార్లే X440 T క్లాసిక్ 350 కంటే చాలా ముందుకు వెళ్లింది. హార్లే X440 Tలో రెండు రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, సురక్షితమైన రైడింగ్ కోసం స్విచబుల్ ABS వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. క్లాసిక్ 350లో డ్యూయల్-ఛానల్ ABS, ట్రిప్పర్ నావిగేషన్ వంటి మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ, టెక్నాలజీ పరంగా హార్లే అంత అధునాతనంగా లేదు. దీని మీటర్ క్లస్టర్ రెట్రో స్టైల్‌తో కూడిన సెమీ-డిజిటల్ యూనిట్.

Tags:    

Similar News