Tata Punch : పంచ్ దూకుడు.. 6 లక్షల యూనిట్ల ఉత్పత్తితో కొత్త రికార్డు!

6 లక్షల యూనిట్ల ఉత్పత్తితో కొత్త రికార్డు!;

Update: 2025-07-17 12:16 GMT

Tata Punch : భారత మార్కెట్లో టాటా పంచ్ ఎస్‌యూవీ సంచలనం సృష్టిస్తోంది. కేవలం నాలుగు సంవత్సరాలలోపే 6 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటి, ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా నిలిచింది. ఇది క్రెటా, బ్రెజా వంటి మోడళ్లను వెనక్కి నెట్టి, మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంది. కేవలం రూ. 6 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల ఈ ఎస్‌యూవీ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. టాటా పంచ్ ప్రయాణం 2021లో పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2024లో పంచ్ ఈవీ కూడా మార్కెట్‌లోకి రావడంతో దీని పాపులారిటీ మరింత పెరిగింది. ఈ ఎస్‌యూవీ సాధించిన మైలురాళ్లను పరిశీలిస్తే.. ఆగస్టు 2022 నాటికి మొదటి లక్ష యూనిట్ల ఉత్పత్తిని చేరుకుంది. ఆ తర్వాత మే 2023లో 2 లక్షలు, డిసెంబర్ 2023లో 3 లక్షలు, జూలై 2024లో 4 లక్షలు, జనవరి 2025 నాటికి 5 లక్షల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించింది. ప్రస్తుతం జూలై 2025లో, టాటా పంచ్ 6 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని విజయవంతంగా దాటింది.

టాటా పంచ్ భారతదేశంలో మొదటిసారి కారు కొనేవారికి మొదటి ఎంపికగా మారింది. దీనికి ప్రధాన కారణాలు సౌకర్యం, సేఫ్టీ, ఆకర్షణీయమైన ఎస్‌యూవీ లాంటి లుక్ కలగలిసి ఉండటం. గణాంకాలను బట్టి చూస్తే, దాదాపు 70 శాతం ఐసీఈ పంచ్ యజమానులు మొదటిసారి కారు కొంటున్నవారే. అంతేకాకుండా, ఇది కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. దీని కాంపాక్ట్ సైజు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మంచి రోడ్ పర్‌ఫార్మెన్స్ కారణంగా మహిళా డ్రైవర్లలో కూడా ఇది బాగా పాపులర్ అయింది. పంచ్ ఈవీ యజమానులలో ఏకంగా 25 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. అమ్మకాల పరంగా చూస్తే, 24 శాతం కార్లు టైర్ 1 నగరాల్లో, 42 శాతం టైర్ 2 నగరాల్లో, 34 శాతం టైర్ 3 నగరాల్లో అమ్ముడయ్యాయి. 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచి చరిత్ర సృష్టించింది.

టాటా పంచ్ ధర ప్రస్తుతం రూ.6.00 లక్షల నుంచి ప్రారంభమై రూ.10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 86 బీహెచ్‌పీ పవర్‌ను ,113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. గ్రౌండ్ క్లియరెన్స్ 187 మీ.మీ. వరకు ఉంటుంది. ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, iRA కనెక్టెడ్ కార్ టెక్ వంటివి ఉన్నాయి. ఇది 5-సీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 366 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది.

Tags:    

Similar News