దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల భద్రతను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. అన్ని రకాల బైక్‌లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమలును తప్పనిసరిగా చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త విధానం ప్రకటించనుంది. ఈ మార్పు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



ప్రస్తుతం దేశంలో 150సీసీకి పైబడిన ఇంజిన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలకే ఏబీఎస్ విధానం వర్తిస్తోంది. కానీ, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు తీసుకునే ముందస్తు చర్యగా, అన్ని ఎంట్రీ లెవల్ బైక్‌లకూ ఈ విధానాన్ని వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 2022 గణాంకాల ప్రకారం దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో సుమారు 20 శాతం ద్విచక్ర వాహనాల వల్లనే జరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో తక్కువ శ్రేణి బైక్‌ల భద్రతపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది.



ఈ నిర్ణయం వల్ల ఎంట్రీ లెవల్ మోడళ్లపైనా ప్రభావం తప్పదు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రధానంగా బైక్ ధరలు సుమారు రూ.2,500 నుండి రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ అదనపు వ్యయం ప్రయాణికుల ప్రాణాలకు రక్షణగా మారుతుందన్నదే ప్రభుత్వ అభిప్రాయం.



ఏబీఎస్ అంటే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కసారిగా బ్రేక్ వేయగానే చక్రాలు లాక్ కాకుండా, వాహనాన్ని అదుపులో ఉంచే విధానమే ఇది. ఈ సాంకేతికత వలన వాహనానికి సమతూకం కోల్పోకుండా, ప్రమాదాలను నివారించగలగడం దీని ప్రత్యేకత.


Tags: