Crude Oil : చమురు మార్కెట్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. బయటపడ్డ భారీ నిక్షేపాలు.. భారత్ కు ఇక పండగే
బయటపడ్డ భారీ నిక్షేపాలు.. భారత్ కు ఇక పండగే
Crude Oil : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ప్రపంచ చమురు మార్కెట్‌కు ఊరటనిచ్చే ఒక శుభవార్త వినిపిస్తోంది. ఇరాన్ తన హోర్ముజ్ జలసంధిని ఎప్పుడు మూసివేస్తుందో, ఎప్పుడు తెరుస్తుందో తెలియని సందిగ్ధంలో ఉన్న తరుణంలో, మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక భారీ అప్‌డేట్ వచ్చింది. యుద్ధాలు, అస్థిరతకు మారుపేరుగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు నల్ల బంగారం(చమురు) గనుల మీద కూర్చుని ఉందని తేలింది. త్వరలోనే ఈ ముస్లిం దేశం ఆసియాలోనే చమురు రారాజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడైన ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఈ నిధులు బయటపడటం మన దేశానికి కూడా పెద్ద ఊరటనిచ్చే విషయమే.
దశాబ్దాలుగా అంతర్గత పోరాటాలు, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇంధన రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఉత్తర జౌజ్జాన్ ప్రాంతంలోని అమూ దర్యా చమురు బేసిన్‌లో భారీ నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే అక్కడ జుమ్రాడ్ సాయి అనే ప్రాంతంలో ఐదు బావుల నుంచి చమురు ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు సుమారు 500 క్యూబిక్ మీటర్ల చమురును వెలికితీస్తున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య వేల రెట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో సుమారు 400 కిలోమీటర్ల మేర సీస్మిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చమురుతో పాటు భారీగా గ్యాస్ నిక్షేపాలు కూడా ఉన్నట్లు తేలింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిస్థాయిలో చమురు ఎగుమతులు ప్రారంభిస్తే, ఆ దేశ ఆర్థిక పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోతుంది. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య, ఆఫ్ఘనిస్తాన్ ఒక ఆశాదీపంలా కనిపిస్తోంది.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో బలమైన వ్యాపార బంధం ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏడాదికి ఒక బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. భారత్ నుంచి మందులు, యంత్రాలు, సోయాబీన్ మీల్ వంటివి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్తుంటే, అక్కడి నుంచి మనం కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్, ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాం. పాకిస్తాన్‌ను పక్కన పెట్టి భారత్ నిర్మించిన చాబహార్ పోర్ట్ ద్వారా ఈ రవాణా సాఫీగా సాగుతోంది. ఎయిర్ కారిడార్ కూడా ఈ వాణిజ్యానికి మరింత బలాన్నిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ గనుక చమురు ఎగుమతిదారుగా మారితే, భారత్‌కు అది ఒక అద్భుతమైన అవకాశం. రష్యా, ఇరాన్ కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం భారత్‌కు చౌకగా, వేగంగా ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు లేదా ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఇది భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి కూడా పరోక్షంగా సహాయపడవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లోని గనుల శాఖ ఇప్పటికే చమురు ఎగుమతుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.