Air India : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్ భారీగా తగ్గించిన ఎయిర్ ఇండియా

ఫ్యూయల్ సర్‌చార్జ్ భారీగా తగ్గించిన ఎయిర్ ఇండియా

Update: 2026-07-03 06:21 GMT

Air India : విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా లక్కీ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, విమాన ఇంధన ధరలు తగ్గడంతో, ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధిస్తున్న ఫ్యూయల్ సర్‌చార్జ్ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల నార్త్ అమెరికా, యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రయాణించే వారికి టికెట్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ తగ్గింపు రేట్లు జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల చమురు మార్కెటింగ్ కంపెనీలు విమాన ఇంధన ధరలను లీటరుకు రూ.5 చొప్పున తగ్గించాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో మే 25వ తేదీ తర్వాత ముడిచమురు ధరలు దాదాపు 28 శాతం మేర పడిపోయాయి. ఈ సానుకూల ప్రభావంతో ఎయిర్ ఇండియా తన రూట్లలో ఇంధన భారాన్ని తగ్గించింది. కొత్త రేట్ల ప్రకారం.. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్లే విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను ప్రతి టికెట్‌కు 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించారు. అంటే ప్రయాణికులకు నేరుగా 80 డాలర్ల (సుమారు రూ.6,600) ఆదా అవుతుంది. అలాగే యూరప్, బ్రిటన్ దేశాలకు వెళ్లే రూట్లలో ఈ రుసుమును 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించడం గమనార్హం.

నిజానికి గత ఏప్రిల్ నెలలో పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ సమయంలో విమానాల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎయిర్ ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో ఏప్రిల్ 7న ఈ సర్‌చార్జీలను పెంచింది. సాధారణంగా ఏ విమానయాన సంస్థకైనా వారి మొత్తం నిర్వహణ వ్యయంలో 40 నుంచి 45 శాతం ఖర్చు కేవలం విమాన ఇంధనానికే అవుతుంది. అందువల్ల ఇంధన ధరల్లో వచ్చే చిన్న మార్పు అయినా విమాన టికెట్లపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడటంతో ప్రయాణికులకు ఈ ఊరట లభించింది.

ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా కేవలం పైన పేర్కొన్న నాలుగు ప్రధాన అంతర్జాతీయ రూట్లలో మాత్రమే ఇంధన రుసుమును తగ్గించింది. మిగిలిన దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల సర్‌చార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ టికెట్లపై 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు, దేశీయ టికెట్లపై రూ.299 నుంచి రూ.899 వరకు ఇంధన రుసుమును వసూలు చేసేది. ఎయిర్ ఇండియా బాటలోనే రానున్న రోజుల్లో ఇండిగో, విస్తారా వంటి దేశీయ రంగానికి చెందిన మిగతా విమానయాన సంస్థలు కూడా ఫ్యూయల్ సర్‌చార్జీలను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News