UPI Payments : ఆ నగరంలో ఇక క్యాష్ మాత్రమే.. షాపుల్లో యూపీఐతో పేమెంట్స్ చేయలేరు

షాపుల్లో యూపీఐతో పేమెంట్స్ చేయలేరు;

Update: 2025-07-15 05:10 GMT

UPI Payments : డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఎప్పుడూ ముందుండే బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి ఇబ్బందులు పెరుగుతున్నాయి. నగరంలోని వీధుల్లో డిజిటల్ పేమెంట్లను ఈజీ చేసే QR కోడ స్టిక్కర్‌లు ఇప్పుడు మాయమవుతున్నాయి. వాటి స్థానంలో ఇప్పుడు దుకాణాలలో ప్రింటవుట్‌లు లేదా చేతితో రాసిన నోటీసులు వేలాడుతున్నాయి.వాటిపై స్పష్టంగా నో యూపీఐ ఓన్లీ క్యాష్ అని రాసి ఉంది. చిన్న చిన్న దుకాణదారులు ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు. కొందరు పూర్తిగా చెల్లింపు యాప్‌ల వాడకాన్ని నిలిపివేశారు. మరి డిజిటల్ ఇండియాకు ఛాంపియన్‌గా పేరొందిన బెంగళూరు ఇప్పుడు ఎందుకు మళ్ళీ క్యాష్ వైపు మళ్లుతోంది? తెలుసుకుందాం.

యూపీఐ పేమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు?

బెంగళూరులోని చాలా మంది చిన్న దుకాణదారులు యూపీఐ వాడకాన్ని తగ్గించారు. కొందరు కంప్లీట్ గా నిలిపేశారు.. హోరమావుకు చెందిన ఒక దుకాణదారుడు శంకర్ మాట్లాడుతూ, "నేను రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేస్తాను. అందులో నాకు చాలా తక్కువ లాభం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యూపీఐ ద్వారా పేమెంట్స్ తీసుకోవడం నాకు కష్టం" అని అన్నాడు. శంకర్‌లాగే చాలా మంది దుకాణదారులు యూపీఐ ట్రాన్సాక్షన్లు తమకు ఇప్పుడు తలనొప్పిగా మారాయని చెబుతున్నారు. అయితే, దుకాణదారులకు యూపీఐతో ఇంత ఇబ్బంది ఎందుకు వస్తోంది?

అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారణం GST నోటీసులు. బెంగళూరులో వేలాది మంది చిన్న వ్యాపారులకు, రోడ్డు పక్కన ఆహార పదార్థాలు అమ్మేవారు, టీ-బిస్కెట్ బండ్లు నడిపేవారితో సహా, GST డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు అందాయి. కొన్ని సందర్భాల్లో ఈ నోటీసులు లక్షల రూపాయల విలువైనవి. బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వినయ్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, GST అధికారుల టాక్స్ నోటీసుల భయంతో దుకాణదారులు భయపడుతున్నారని చెప్పారు. ఈ నోటీసుల కారణంగా తమ దుకాణాలను ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని కూడా చాలా మంది దుకాణదారులు భయపడుతున్నారు. అందుకే వారు ఇప్పుడు యూపీఐకి బదులుగా క్యాష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

GST చట్టం ప్రకారం ఏదైనా వ్యాపారి వస్తువులను విక్రయించి, అతని వార్షిక ఆదాయం రూ.40 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, వారికి GST రిజిస్ట్రేషన్తప్పనిసరి. సర్వీసులు అందించే వ్యాపారమైతే, ఈ పరిమితి రూ.20 లక్షలు. కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 2021-22 నుండి ఇప్పటివరకు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా నోటీసులు జారీ చేశామని చెబుతోంది. డిపార్ట్‌మెంట్ ప్రకారం, చాలా మంది వ్యాపారులు యూపీఐ ద్వారా రూ.40 లక్షల కంటే ఎక్కువ సంపాదించారు. కానీ వారు GST రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, పన్ను కూడా చెల్లించలేదు. అలాంటి వ్యాపారులకు డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్ చేసుకోమని, పన్ను చెల్లించమని కోరింది.

Tags:    

Similar News