CM Vijay : ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే 16 లక్షల మందికి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్
16 లక్షల మందికి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్
CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సీ.జోసెఫ్ విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలోని సుమారు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కళ్లు చెదిరే ఆర్థిక తోడ్పాటును అందిస్తూ భారీ ప్రకటన చేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఉద్యోగుల కష్టాలను గుర్తించిన సీఎం.. కరవు భత్యాన్ని (DA) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2 శాతం డీఏ పెంపు.. నేరుగా అకౌంట్లోకి
బుధవారం తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు అందే కరవు భత్యాన్ని 2 శాతం మేర పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ నిర్ణయం జనవరి 1, 2026 నుండే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ఉద్యోగులకు 58 శాతంగా ఉన్న డీఏ.. తాజా పెంపుతో 60 శాతానికి చేరుకుంది. దీనివల్ల ఉద్యోగుల చేతికి అందే నెలవారీ జీతం గణనీయంగా పెరగనుంది.
ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా భారీ ఊరట
సీఎం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులకే కాకుండా.. రిటైర్ అయిన వృద్ధులకు కూడా వరంగా మారింది. దాదాపు 16 లక్షల కుటుంబాలకు ఈ పెంపు వల్ల నేరుగా ప్రయోజనం కలుగుతుంది. సచివాలయ అధికారుల నుంచ మారుమూల గ్రామాల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వరకు అందరికీ పెరిగిన జీతాలు అందుతాయి. వీటితో పాటు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా పెరిగిన రేటు ప్రకారం చెల్లింపులు జరగనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిర్ణయం ఒక రక్షణ కవచంలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖజానాపై రూ.1230 కోట్ల భారం
ఈ రెండు శాతం డీఏ పెంపు వల్ల తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.1,230 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడినా సరే.. తమను నమ్ముకున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ ప్రభుత్వం పేర్కొంది. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న మధ్యతరగతి , దిగువ తరగతి ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ ప్రకటనతో అటు తమిళనాడులోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ సీఎం విజయ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.