Crude Oil : వాహనదారులకు ఊరట.. $100 లోపుకు పడిపోయిన ముడిచమురు ధరలు
$100 లోపుకు పడిపోయిన ముడిచమురు ధరలు
Crude Oil : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడం దేశంలోని సామాన్య వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. గ్లోబల్ మార్కెట్లో వరుసగా ఏడో రోజు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్ల లోపే కొనసాగుతున్నాయి. ఈ సానుకూల ప్రభావంతో భారతీయ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఎనిమిదో రోజు కూడా యథాతథంగా ఉంచాయి. గత మే నెల మధ్యలో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ, గత ఎనిమిది రోజులుగా రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు సంబంధించిన ముందడుగు పడటమే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా అనిశ్చితి వాతావరణం పూర్తిగా తొలగిపోలేదు. ఇరాన్, అమెరికాల మధ్య సంబంధాలు మళ్లీ కాస్త చెడిపోయినా లేదా ఏదైనా సైనిక చర్య జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పైకి లేచే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే.. గల్ఫ్ దేశాలకు చెందిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ట్రేడింగ్ సమయంలో ఇది ఒక దశలో 94.71 డాలర్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. గత మే 26వ తేదీన బ్రెంట్ క్రూడ్ చివరిసారిగా 100.73 డాలర్ల వద్ద కనిపించింది. మరోవైపు అమెరికన్ క్రూడ్ అయిన డబ్ల్యూటీఐ ధరలు కూడా స్వల్పంగా తగ్గి 92 డాలర్ల లోపుకు చేరాయి. ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 91.83 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మే 21వ తేదీ తర్వాత అమెరికన్ క్రూడ్ ధరలు 100 డాలర్ల లోపుకు రావడం ఇదే మొదటిసారి.
నిజానికి గత మే నెల ద్వితీయార్థంలో వాహనదారులపై చమురు కంపెనీలు భారీగా భారం మోపాయి. ముఖ్యంగా మే 15 నుంచి మే 25వ తేదీ మధ్య కాలంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా నాలుగు సార్లు పెంచాయి. దీనివల్ల కేవలం పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు 8 శాతం మేర ప్రియమయ్యాయి. ఆ తాజా బాదుడుతోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటి దూసుకుపోయింది. అయితే మే 25న చివరిసారిగా రేట్లు పెరిగిన తర్వాత, ఇప్పటివరకు ధరలు స్థిరంగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
చమురు కంపెనీల తాజా ప్రకటన ప్రకారం దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఈ క్రింది విధంగా స్థిరంగా కొనసాగుతున్నాయి:
ఢిల్లీ : దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 వద్ద, డీజిల్ ధర రూ.95.20 వద్ద విక్రయించబడుతోంది.
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21 కాగా, డీజిల్ ధర రూ.97.83 వద్ద స్థిరంగా ఉంది.
కోల్‌కతా : ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.113.51 వద్ద, డీజిల్ ధర రూ.99.02 వద్ద కొనసాగుతోంది.
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రేటు రూ.107.77 గా ఉండగా, డీజిల్ రేటు రూ.99.55 వద్ద విక్రయమవుతోంది.