Crude Oil : ట్రంప్ ఒక్క మాటలో కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు.. ఒక్క రాత్రిలో ఏకంగా 5శాతం డౌన్
ఒక్క రాత్రిలో ఏకంగా 5శాతం డౌన్
Crude Oil : భారతదేశంలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు అత్యంత భారీ ఉపశమనం లభించబోతోంది. గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ బెంబేలెత్తించిన అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 5 శాతం మేర భారీగా పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క సంచలన ప్రకటనతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అతలాకుతలమైంది. ఈ ధరల పతనం ఇలాగే కొనసాగితే.. భారతీయ మార్కెట్లో త్వరలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క ముక్కే కారణం
అంతర్జాతీయ చమురు మార్కెట్లో బుధవారం రాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ, గురువారం ఉదయం వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒక అప్‌డేట్ సీన్ మార్చేసింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రౌండ్ టేబుల్ శాంతి చర్చలు ఇప్పుడు అత్యంత చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదరబోతోందని డొనాల్డ్ ట్రంప్ జర్నలిస్టులతో స్పష్టం చేశారు. ఈ ప్రకటన బయటకు రాగానే.. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్ల వద్దకు పడిపోయింది. అలాగే అమెరికన్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా భారీగా క్షీణించి 99 డాలర్ల మార్కుకు పడిపోయింది.
ప్రపంచాన్ని వణికించిన హోర్ముజ్ జలసంధి భయాలు
ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఏకంగా 40 శాతం వరకు పెరిగిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు (1/5th) వాటా కేవలం హోర్ముజ్ జలసంధి సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఒకవేళ ఇరాన్ యుద్ధం కారణంగా ఈ రూట్ గనుక పూర్తిగా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవుతుందని వ్యాపారులు భయపడ్డారు. కానీ, ఇప్పుడు ట్రంప్ దౌత్యపరమైన చొరవతో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన లక్షలాది బ్యారెళ్ల చమురు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుండటంతో ట్రేడర్లు ఊపిరి పీల్చుకున్నారు.
2027 వరకు ముడిచమురు సరఫరా సాధారణం కాదా?
ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి ధరలు తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయి పరిశ్రమల అధినేతలు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుల్తాన్ అల్ జాబెర్ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఈ రోజే గొడవలు పూర్తిగా ముగిసిపోయినా.. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరా నెట్‌వర్క్ రాత్రికి రాత్రే సాధారణ స్థితికి రాదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న పైప్‌లైన్లు, సరఫరా వ్యవస్థ మళ్లీ పాత రూపానికి చేరుకోవడానికి మరో ఏడాది అంటే 2027 వరకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి.