E-20 Petrol : ఈ-20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా రచ్చ.. బంకుల్లో సాధారణ పెట్రోల్ ఆప్షన్ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు

బంకుల్లో సాధారణ పెట్రోల్ ఆప్షన్ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు

Update: 2026-07-11 05:23 GMT

E-20 Petrol : దేశంలో ఎథనాల్ కలిపిన ఈ-20 పెట్రోల్ వాడకంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఇంధనం వల్ల మైలేజ్ దారుణంగా పడిపోతోందని, పాత వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వివాదం కాస్తా రాజకీయ రంగు పులుముకోవడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజల నుంచి వస్తున్న విమర్శలు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, పెట్రోల్ బంకుల్లో ఈ-20 పెట్రోల్‌తో పాటు గతంలో ఉండే సాధారణ పెట్రోల్‌ను కూడా ఒక ఆప్షన్‌గా కస్టమర్లకు అందుబాటులోకి ఉంచేలా ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములాపై ఆలోచన చేస్తోంది.

ఈ-20తో మైలేజ్ పడిపోతోందా?

ఈ-20 పెట్రోల్ వివాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ఎథనాల్ క్యాలరిఫిక్ వాల్యూ సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందని, అందువల్ల మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. అయితే ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం మైలేజ్ కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే తగ్గుతుందని, కానీ క్షేత్రస్థాయిలో పాత వాహనాలు వాడుతున్న వారు మాత్రం 20 నుంచి 30 శాతం వరకు మైలేజ్ పడిపోతోందని ఆరోపిస్తున్నారు. మైలేజ్ తగ్గినా, ఈ-20 ఇంధనం వల్ల పికప్ పెరుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

పాత బండ్ల యజమానుల్లో గుబులు

ఈ-20 ఇంధనాన్ని ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా తొందరపాటుతో తీసుకొచ్చిందని వాహనదారులు మండిపడుతున్నారు. ఒకవేళ ఈ పెట్రోల్ వల్ల ఇంజన్ భాగాలు పాడైతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఈ ఆరోపణలను ప్రచారంగా కొట్టిపారేసింది. మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ సంస్థలు కోట్లాది వాహనాలకు సర్వీసింగ్ చేశాయని, ఎక్కడా ఈ-20 వల్ల ఇంజన్ తుప్పు పట్టినట్లు లేదా పాడైనట్లు ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేసింది. కార్లు, బైకుల తయారీ సంస్థలతో ఏళ్ల తరబడి శాస్త్రీయంగా చర్చలు జరిపిన తర్వాతే దశలవారీగా ఎథనాల్ బ్లెండింగ్‌ను అమలు చేశామని కేంద్రం వివరించింది.

ఒకే బంకులో మూడు రకాల పెట్రోల్ సాధ్యమేనా?

వాహనదారులు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునేందుకు సాధారణ పెట్రోల్, ఈ-10, ఈ-20 రకాలను వేర్వేరుగా బంకుల్లో ఉంచాలని కోరుతున్నారు. కానీ ఇది అంత సులభం కాదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. మూడు వేర్వేరు ఇంధనాల కోసం విడివిడిగా అండర్ గ్రౌండ్ ట్యాంకులు, పైప్‌లైన్లు, అదనపు డిస్పెన్సింగ్ మిషన్లను ఏర్పాటు చేయడం ఆర్థికంగా ఎంతో ఖరీదైన వ్యవహారమని, చమురు కంపెనీలకు ఇది పెద్ద సవాల్ అని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నార్మల్ పెట్రోల్ ఆప్షన్ ఇవ్వాలని డిసైడ్ అయితే, దాని ధరను ఎలా నిర్ణయించాలనేది కూడా పెద్ద సమస్యగా మారనుంది.

ధరలు తగ్గవు కానీ దేశానికి లాభం

ఎథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయని సామాన్యులు ఆశించారు, కానీ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఎథనాల్ బ్లెండింగ్ ముఖ్య ఉద్దేశం ధరలు తగ్గించడం కాదు, విదేశీ ముడి చమురు దిగుమతులపై భారతదేశ ఆధారపడటాన్ని తగ్గించడమేనని స్పష్టం చేసింది. 2014 నుండి ఇప్పటివరకు ఎథనాల్ వాడకం వల్ల దేశానికి రూ.1,97,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. అలాగే 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతి తగ్గింది. పర్యావరణానికి మేలు చేస్తూ 952 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని, దేశీయంగా రైతులకు రూ.1,66,000 కోట్ల చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం డేటాను విడుదల చేసింది.

Tags:    

Similar News