Natural Gas Reserve : భారత్‌కు బంపర్ లాటరీ.. అండమాన్ సముద్రంలో భారీగా బయటపడ్డ సహజ వాయువు నిల్వలు
అండమాన్ సముద్రంలో భారీగా బయటపడ్డ సహజ వాయువు నిల్వలు
Natural Gas Reserve : భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించి ఒక అద్భుతమైన శుభవార్త అందింది. దేశీయ ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ అన్వేషణ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) అండమాన్ సముద్ర తీరంలో భారీ సహజ వాయువు నిల్వలను కనుగొంది. అండమాన్ లోని షాల్లో ఆఫ్షోర్ బ్లాక్ చేపట్టిన మూడో అన్వేషణ బావి తవ్వకాల్లో ఈ సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు శుక్రవారం సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ బ్లాక్‌లో హైడ్రోకార్బన్ ఆనవాళ్లు లభించడం ఇది రెండోసారి కావడం విశేషం.
తీరానికి దగ్గరలోనే విజయపురం-3 బావి
ఆయిల్ ఇండియా లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సరికొత్త గ్యాస్ నిల్వలు ఉన్న బావికి విజయపురం-3 అని పేరు పెట్టారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో, సుమారు 355 మీటర్ల లోతైన సముద్ర గర్భంలో ఈ బావిని తవ్వారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (OALP) కింద కేటాయించిన AN-OSHP-2018/1 అనే ఆఫ్షోర్ బ్లాక్‌లో ఈ డ్రిల్లింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
ఉత్పత్తి పరీక్షల్లో పెరిగిన గ్యాస్ ప్రెజర్
సముద్ర మట్టానికి దాదాపు 1,900 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న ఈఓసీన్ అనే పురాతన భౌగోళిక పొరలలో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో గ్యాస్ నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. బావికి రంధ్రాలు చేసిన వెంటనే లోపల ఒత్తిడి వేగంగా పెరిగి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనితో పాటు ఫ్లేరింగ్ ప్రక్రియ ద్వారా గ్యాస్ నాణ్యతను పరీక్షించారు. ప్రస్తుతం ఈ గ్యాస్ నమూనాలను ల్యాబొరేటరీకి పంపి, దాని శక్తి సామర్థ్యం, ఇతర రసాయన నిర్మాణాలపై పరిశోధనలు జరుపుతున్నారు.
ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి
ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. అండమాన్ సముద్రంలో ఆయిల్ ఇండియా సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా దేశ ప్రజలతో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో సెప్టెంబర్ 2025 లోనూ ఇదే బ్లాక్‌లోని విజయపురం-2 బావిలో గ్యాస్ ఆనవాళ్లు లభించాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో తవ్విన మూడు బావుల్లో రెండింటిలో ఇంధన నిల్వలు బయటపడటంతో ఇక్కడ మరిన్ని భారీ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని కంపెనీ బలంగా నమ్ముతోంది.
మరింత వేగంగా సిస్మిక్ సర్వేలు
గత ఏడాది తొలిసారి గ్యాస్ నిల్వలు లభించినప్పటి నుంచి ఆయిల్ ఇండియా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. అండమాన్ బ్లాక్‌లో లభ్యమైన 2D సిస్మిక్ డేటాను మళ్లీ విశ్లేషించడంతో పాటు, అదనంగా మరో 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక 3D సిస్మిక్ సర్వేను కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ 3D డేటా ప్రాసెసింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ నివేదికలు వచ్చిన వెంటనే కచ్చితమైన అంచనాలతో మరిన్ని కొత్త బావుల తవ్వకాలను ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
దేశ ఇంధన భద్రతకు కొండంత అండ
భారత ప్రభుత్వ రంగంలోని ప్రతిష్టాత్మక మహారత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా సాధించిన ఈ ఆవిష్కరణ దేశ ఆర్థిక రంగాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం తన అవసరాలకు కావలసిన సహజ వాయువు, ముడిచమురు కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాల దిగుమతులపైనే ఆధారపడుతోంది. భవిష్యత్తులో అండమాన్ తీరంలో వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైతే గనుక, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భారం తగ్గడమే కాకుండా, దేశీయంగా గ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి.