EPFO EDLI Scheme: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో దాగున్న అద్భుత ప్రయోజనం.. 7 లక్షల బీమా ఎలా క్లెయిమ్ చేయాలి?
7 లక్షల బీమా ఎలా క్లెయిమ్ చేయాలి?
EPFO EDLI Scheme: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పీఎఫ్ పథకం ఎంతో ప్రయోజనకరమైనది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి రిస్క్ చాలా తక్కువ. అయితే, మీ పీఎఫ్ ఖాతా ద్వారా మీకు ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. మీ జీతం నుంచి ఈపీఎఫ్ కట్ అవుతుంటే, ప్రభుత్వం ప్రత్యేక పథకం కింద మీకు రూ. 7 లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. ఈ పథకం పేరే ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం, 1976. ఈపీఎఫ్ సభ్యులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ బీమా పథకం గొప్పదనం ఏమిటంటే.. ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి తరపున సంస్థ మాత్రమే ప్రీమియం చెల్లిస్తుంది. కంపెనీ ఉద్యోగి బేసిక్ సాలరీ, డీఏలో 0.50 శాతం వరకు ప్రీమియం కింద ఈపీఎఫ్ఓలో జమ చేస్తుంది. ఈ పథకం కింద ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవించినప్పుడు, నామినీకి కనీసం రూ. 2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఒకేసారి మొత్తం లభిస్తుంది. ఈ మొత్తాన్ని లెక్కించేందుకు, ఉద్యోగి చివరి 12 నెలల సగటు జీతం (బేసిక్ + డీఏ), అతని పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం ఆధారంగా ఫార్ములాను ఉపయోగిస్తారు.
ఉద్యోగి మరణించిన తర్వాత ఈ బీమా మొత్తాన్ని నామినీ లేదా చట్టపరమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ లేదా చట్టపరమైన వారసులు ఫారం 5 ఐఎఫ్ ను నింపి, దానిని కంపెనీ ద్వారా ధృవీకరించుకోవాలి. ఒకవేళ కంపెనీ అందుబాటులో లేకపోతే, గెజిటెడ్ ఆఫీసర్, ఎంపీ-ఎమ్మెల్యే, బ్యాంక్ మేనేజర్ లేదా గ్రామ పెద్ద వంటి అధికారిక వ్యక్తి ద్వారా ధృవీకరణ పొందవచ్చు. క్లెయిమ్ కోసం డెట్ సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికేట్, బ్యాంక్ వివరాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో ఎన్ని కంపెనీల్లో పనిచేసినా, ఈ పథకం కింద కవరేజ్ కొనసాగుతుంది. చాలా మంది ఉద్యోగులు ఈ ఉచిత బీమా సౌకర్యం గురించి తెలియక నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే ఈపీఎఫ్ఓ సభ్యులందరూ తమ పీఎఫ్ ఖాతాలో నామినీని తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల కష్టకాలంలో కుటుంబానికి త్వరగా ఆర్థిక సహాయం అందుతుంది.