EPFO : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ రూల్స్
ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ రూల్స్
EPFO : దేశంలోని కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా EPFO సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (CITES) ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ సభ్యులందరి డేటాబేస్‌ను ఒకే ఒక కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్‌కు విజయవంతంగా బదిలీ చేసే ప్రక్రియను ఈపీఎఫ్ఓ పూర్తి చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు మునుపటి కంటే చాలా వేగంగా, పారదర్శకంగా మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ఈ మార్పుల గురించి అధికారికంగా ప్రకటిస్తూ.. కొత్త జాతీయ డేటాబేస్ వల్ల దేశవ్యాప్తంగా పీఎఫ్ మరియు పెన్షన్ సేవల స్వరూపమే మారిపోనుందని స్పష్టం చేశారు.
ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు
ఈ సిటెస్ (CITES) ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఈపీఎఫ్ఓ సేవలను పూర్తిగా ఆధునీకరించడం. ఇందులో అత్యాధునిక ఆటోమేషన్, నిబంధనల ఆధారిత డిజిటల్ సిస్టమ్‌ను ఉపయోగించారు. గతంలో ప్రతి ప్రాంతీయ ఈపీఎఫ్ఓ ఆఫీసుకు విడివిడిగా డేటాబేస్ ఉండేది. దీనివల్ల ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్ము లేదా పెన్షన్ క్లెయిమ్ కోసం సంబంధిత ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సభ్యుల డేటా అంతా ఒకే ఒక జాతీయ డేటాబేస్‌లో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల దేశంలోని ఏ ప్రాంతీయ కార్యాలయం నుంచైనా ఉద్యోగుల అభ్యర్థనలను చాలా వేగంగా పరిష్కరించవచ్చు.
ఖాతాదారుల అకౌంట్లలోకి పీఎఫ్ వడ్డీ డబ్బులు
కొత్త విధానం వల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ అయిన వెంటనే డబ్బులు కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా నేరుగా సభ్యుల బ్యాంక్ ఖాతాకు అదే రోజున ఎలక్ట్రానిక్ బదిలీ అవుతాయి. అంతేకాదు, గతంలో పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేసినప్పుడు మునుపటి నెల చివరి తేదీ వరకు మాత్రమే వడ్డీని లెక్కించేవారు. కానీ ఇప్పుడు క్లెయిమ్ ఆమోదం పొందిన తేదీ వరకు వడ్డీని జోడించి ఇస్తారు. దీనివల్ల ఉద్యోగులకు అదనపు వడ్డీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025-26 కు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం.. దాదాపు రూ.1.44 లక్షల కోట్లను జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తర్వాత ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ పోర్టల్ లాగిన్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్ సర్వీస్ రికార్డ్ వంటి వివరాలన్నీ ఒకే చోట చూసుకోవచ్చు.
పీఎఫ్ అడ్వాన్స్ లిమిట్ భారీగా పెంపు
పాత పద్ధతిలో చాలా సార్లు పీఎఫ్ క్లెయిమ్‌లు రిజెక్ట్ అయ్యేవి. కానీ కొత్త డిజిటల్ సిస్టమ్‌లో మనం దరఖాస్తును సబ్‌మిట్ చేసే ముందే, సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా అన్ని డాక్యుమెంట్లను వెరిఫై చేస్తుంది. ఒకవేళ ఏవైనా తప్పులుంటే అక్కడికక్కడే చూపిస్తుంది. దీనివల్ల క్లెయిమ్ రిజెక్షన్ రేటు భారీగా తగ్గుతుంది. అలాగే, అత్యవసర సమయాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడానికి గతంలో ఉన్న రూ.1 లక్ష పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.5 లక్షలకు పెంచింది. పూర్తి కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ క్లెయిమ్‌లు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా కేవలం ఆటో-సెటిల్‌మెంట్ విధానం ద్వారా త్వరగా పూర్తవుతాయి. సభ్యులు తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.
ఉద్యోగం మారితే పీఎఫ్ అకౌంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్
గతంలో పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించి దాదాపు 13 రకాల కఠినమైన రూల్స్ ఉండేవి. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేసి కేవలం మూడు సులభమైన కేటగిరీలుగా మార్చారు. అవి.. అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. వీటితో పాటు ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు తమ పీఎఫ్ అకౌంట్‌ను బదిలీ చేసుకోవడానికి పాత యాజమాన్యం లేదా కొత్త యాజమాన్యం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఖాతా సంఖ్య ఉన్న ఖాతాలు ఉద్యోగం మారిన వెంటనే ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అయిపోతాయి.
ఈపీఎఫ్ఓ అమ్నెస్టీ స్కీమ్ 2026 అంటే ఏమిటి?
ఈ డిజిటల్ సంస్కరణలతో పాటు ఈపీఎఫ్ఓ అమ్నెస్టీ స్కీమ్ 2026ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఆదాయపన్ను చట్టం 1961 కింద గుర్తింపు పొంది, మినహాయింపు పీఎఫ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ చట్టపరమైన హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం ఒకేసారి సువర్ణావకాశాన్ని కల్పించింది. ఈ పథకం జూన్ 29, 2026 నుంచి ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. ఐటీ శాఖ గుర్తింపు ఉండి, ఈపీఎఫ్ చట్టం పరిధిలోకి రాని సంస్థలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.