EPFO : పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ గిఫ్ట్.. క్లెయిమ్‌ల నుంచి పెన్షన్ వరకు 10 పెద్ద మార్పులు ఇవే
10 పెద్ద మార్పులు ఇవే
EPFO : ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్స్ నిర్వహించే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తన కోట్లాది మంది సభ్యుల కోసం సరికొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రీకృత ఐటీ ఆధారిత సేవల ప్రాజెక్ట్ కింద ఈపీఎఫ్‌ఓ తన సభ్యుల డేటా మొత్తాన్ని ఒకే కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మార్చింది. ఈ సాంకేతిక మార్పుల వల్ల పీఎఫ్ సేవలు మునుపటి కంటే చాలా వేగంగా, పారదర్శకంగా మారనున్నాయి. కేంద్ర కార్మిక, ఉపాధి ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా కస్టమర్లకు అందే ప్రయోజనాలను వెల్లడించారు. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా బదిలీ అవ్వడం, అడ్వాన్స్ క్లెయిమ్ లిమిట్ పెంచడం, దేశంలో ఏ కార్యాలయం నుండైనా సేవలు పొందడం వంటి 10 ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయి.
జులై 15 లోపు పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు
పీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వడ్డీ జమపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆర్థిక సంవత్సరం 2025-26 కు సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీ డబ్బులను జులై 15వ తేదీ లోపు సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దాదాపు రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ మొత్తాన్ని తగిన పరిశీలనల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలకు బదిలీ చేయనున్నారు. దీనితో పాటు, కొత్తగా తెచ్చిన డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సభ్యులు లాగిన్ అవ్వగానే వారి పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్ రికార్డులు, తమకు అందిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల సమాచారాన్ని ఒకే చోట స్పష్టంగా చూసుకునే వీలుంటుంది.
క్లెయిమ్‌ల తిరస్కరణకు చెక్
పీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే ప్రక్రియలో ఇకపై రిజెక్షన్ల భయం ఉండదు. కొత్త సిస్టమ్ ప్రకారం పీఎఫ్ కార్యాలయానికి క్లెయిమ్ చేరకముందే ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ ప్రి-వాలిడేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్లు లేదా సమాచారంలో ఏవైనా లోపాలు ఉంటే సభ్యులకు ముందే అలర్ట్ అందుతుంది. అలాగే, కేవైసీ పూర్తి చేసుకున్న సభ్యులకు గతంలో రూ.1 లక్షగా ఉన్న ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని ఏకంగా రూ.5 లక్షల వరకు పెంచారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా కంప్యూటర్ సిస్టమే నేరుగా మీ క్లెయిమ్‌ను ఆమోదించి, సెటిల్‌మెంట్ అయిన రోజునే నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ఏదైనా అదనపు సమాచారం కావాల్సి వస్తే పీఎఫ్ ఆఫీస్ ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు పంపుతుంది, సభ్యులు కూడా ఆన్‌లైన్ ద్వారానే సమాధానాలు ఇవ్వవచ్చు.
యూఏఎన్ ద్వారా ఆటోమేటిక్ పీఎఫ్ బదిలీ
గతంలో ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీ అకౌంట్‌కు మార్చుకోవడానికి ప్రత్యేకంగా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఫామ్‌లు నింపాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఉద్యోగం మారిన వెంటనే పీఎఫ్ ఖాతా కొత్త కంపెనీకి ఆటోమేటిక్‌గా బదిలీ అయిపోతుంది. దీనితో పాటు విత్‌డ్రా నియమాలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. గతంలో ఉన్న 13 రకాల క్లిష్టమైన ఉపసంహరణ నిబంధనలను తగ్గించి కేవలం మూడు కేటగిరీలుగా మార్చారు. అత్యవసర అవసరాలు, ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే విభాగాల కింద సభ్యులు తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి గరిష్టంగా 75 శాతం వరకు సులభంగా డ్రా చేసుకోవచ్చు. అలాగే పీఎఫ్ తుది సెటిల్‌మెంట్ జరిగేటప్పుడు, కేవలం గత నెల ఆఖరి రోజు వరకే కాకుండా క్లెయిమ్ ఆమోదం పొందిన తేదీ వరకు వడ్డీని లెక్కించి చెల్లిస్తారు.
దేశంలో ఏ పీఎఫ్ ఆఫీస్ నుండైనా సేవలు
ఈపీఎఫ్‌ఓ తీసుకువచ్చిన ఈ సరికొత్త కేంద్రీకృత వ్యవస్థ వల్ల ప్రాంతీయ కార్యాలయాల పరిమితులు తొలగిపోయాయి. పీఎఫ్ సభ్యులు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పీఎఫ్ కార్యాలయంలోనైనా తమ సమస్యలకు సంబంధించిన సహాయాన్ని మరియు సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెసులుబాటు ఈపీఎస్ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే పీఎఫ్ ఉద్యోగులు దేశంలోని ఏ ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లైనా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
నచ్చిన బ్యాంక్ ఖాతాలో పెన్షన్
కొత్త కేంద్రీకృత పెన్షన్ పేమెంట్ విధానం ద్వారా పెన్షనర్లకు మరో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో పెన్షన్ డబ్బులు కేవలం పీపీఓ నంబర్‌తో లింక్ అయిన నిర్దేశిత బ్యాంక్ బ్రాంచ్‌లో మాత్రమే జమవుతుండేవి. దీనివల్ల పెన్షనర్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంక్ ఖాతాలోనైనా తమ పెన్షన్ డబ్బులను నేరుగా పొందే సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల వృద్ధులు పెన్షన్ కోసం బ్యాంకులకు, పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి.