EPFO PF Interest : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ ఖాయం
ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ ఖాయం
EPFO PF Interest : దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్ సంస్థ అయిన ఈపీఎఫ్ఓ.. తన ఖాతాదారులకు ఒక అద్భుతమైన వార్తను అందించింది. ఆర్థిక సంవత్సరం 2025-26కు గానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును గత ఏడాది లాగే 8.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2026 న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టాస్ సమావేశంలోనే ఈ వడ్డీ రేటుకు అధికారికంగా ముద్ర పడింది. ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఈ పాపులర్ రిటైర్మెంట్ స్కీమ్‌లో వరుసగా మూడో ఏడాది కూడా ఇంత భారీ స్థాయిలో రిటర్న్స్ లభిస్తుండటం విశేషం.
వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడు వస్తాయి?
ప్రస్తుతం జూన్ నెల సగం ముగిసిపోవడంతో చాలా మంది ఉద్యోగులు తమ వడ్డీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ ఇంకా వడ్డీ డబ్బులను బదిలీ చేయడానికి ఎలాంటి నిర్దిష్టమైన తేదీని ప్రకటించలేదు. కానీ గత కొన్ని సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే దీనిపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు. గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 2025 లో వడ్డీ రేటుకు తుది ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జూన్ నెల నుంచి ఖాతాలను అప్‌డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమై, జూలై మొదటి వారం కల్లా మెజారిటీ ఖాతాదారుల అకౌంట్లలోకి వడ్డీ డబ్బులు చేరిపోయాయి. ఈ ఏడాది కూడా అదే పద్ధతి కొనసాగితే, రాబోయే కొన్ని వారాల్లోనే మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ సొమ్ము దర్శనమిస్తుంది.
ప్రకటన వచ్చిన వెంటనే డబ్బులు ఎందుకు పడవు?
చాలా మంది ఉద్యోగులు వడ్డీ రేట్ల ప్రకటన రాగానే వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిపోతాయని భావిస్తారు, కానీ అది అంత సులభం కాదు. సీబీటీ సిఫార్సు చేసిన తర్వాత ఆ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ వద్దకు వెళ్తుంది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే ఈపీఎఫ్ఓ వడ్డీ లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈపీఎఫ్ఓ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్స్ సంస్థలలో ఒకటి. దీని పరిధిలో ఏకంగా 7 కోట్ల మందికి పైగా యాక్టివ్ సభ్యులు ఉన్నారు. ప్రతి ఉద్యోగి ఖాతాలో జరిగే నెలవారీ పొదుపు, అడ్వాన్స్ విత్‌డ్రాయల్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి అన్ని వివరాలను క్షుణ్ణంగా లెక్కించిన తర్వాతే ఫైనల్ వడ్డీని పాస్‌బుక్‌లో నమోదు చేస్తారు.
పాస్‌బుక్ అప్‌డేట్ కావడం ఆలస్యమైతే నష్టమా?
ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల లేదా సర్వర్ లోపాల వల్ల మీ పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ డబ్బులు కనిపించడానికి సమయం పడితే.. దానివల్ల ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగదు. ఎందుకంటే పీఎఫ్ వడ్డీని ఆర్థిక సంవత్సరం పొడవునా మీ అకౌంట్ లో ఉండే నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. మీ డబ్బుకు సంబంధించిన వడ్డీ లెక్కలు ప్రభుత్వం వద్ద పక్కాగా ఉంటాయి. కాబట్టి ఆ అమౌంట్ మీ పాస్‌బుక్‌లో ఈరోజు కనిపించినా, లేదా నెల రోజుల తర్వాత కనిపించినా మీ లాభం మాత్రం మీకు పూర్తిగా అందుతుంది.
పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా చెక్ చేసుకునే విధానాలు
మీ పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడానికి ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి తమ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అయి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సరిగ్గా లేని వారు కేంద్ర ప్రభుత్వ ఉమంగ్ యాప్ ద్వారా కూడా తమ మొబైల్‌లోనే పీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా లేదా ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా క్షణాల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్, లేటెస్ట్ వడ్డీ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.