EPFO : పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పీఎఫ్ డబ్బులు తీయాలనుకుంటున్నారా? ఇవే రూల్స్

ఇవే రూల్స్

Update: 2026-06-19 06:41 GMT

EPFO : ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటైన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), ఉద్యోగస్తులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. సాధారణంగా పీఎఫ్ సొమ్మును రిటైర్మెంట్ ఫండ్ గా భావిస్తారు. అయితే, ఉద్యోగుల జీవితంలో ఎదురయ్యే పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, సొంతింటి కల, మెడికల్ ఎమర్జెన్సీ, నిరుద్యోగం వంటి ముఖ్యమైన, అత్యవసర పరిస్థితుల్లో తమ పీఎఫ్ ఖాతాలో జమ అయిన సొమ్మును ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది.

పీఎఫ్ ఖాతా నుండి మూడు రకాల విత్‌డ్రాలు

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారులు ప్రధానంగా మూడు పద్ధతులలో తమ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. మొదటిది పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్. ఉద్యోగం పూర్తిగా వదిలేసినప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవడం దీని కిందకు వస్తుంది. రెండవది పీఎఫ్ పాక్షిక విత్‌డ్రా. అవసరాల నిమిత్తం మధ్యలోనే కొంత సొమ్మును అడ్వాన్స్ గా తీసుకోవడం. మూడవది పెన్షన్ విత్‌డ్రా బెనిఫిట్. పీఎఫ్ ఖాతాలో ఉండే పెన్షన్ ఫండ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడం.

పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎంత తీసుకోవచ్చు?

ఒకవేళ మీరు మీ పిల్లల ఉన్నత చదువుల కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీయాలనుకుంటే దానికి కొన్ని ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం వాటాలో గరిష్టంగా 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ సదుపాయం పిల్లలు టెన్త్ క్లాస్ పూర్తి చేసిన తర్వాత, కాలేజీ లేదా యూనివర్సిటీలలో జాయిన్ అయ్యే ఉన్నత చదువుల ఖర్చుల కోసమే అందుబాటులో ఉంటుంది.

పీఎఫ్ అడ్వాన్స్ కోసం ఆన్‌లైన్ లో అప్లై చేయడం ఎలా?

పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.. రెండు మార్గాలను అందిస్తోంది. ఆఫ్‌లైన్ లో అయితే కాంపోజిట్ క్లేమ్ ఫారమ్‌ను నింపి స్థానిక పీఎఫ్ ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్ విధానాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉద్యోగులు నేరుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌ లోకి వెళ్లి ఆన్‌లైన్ లోనే క్లేమ్ అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో అప్లై చేయడం ద్వారా పీఎఫ్ అడ్వాన్స్ క్లేమ్ చాలా వేగంగా ప్రాసెస్ చేయబడి, కేవలం కొద్ది రోజుల్లోనే ఆ సొమ్ము నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయబడుతుంది.

యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. త్వరలోనే సరికొత్త సేవలు

ఈపీఎఫ్ఓ తన కోట్ల మంది ఖాతాదారుల కోసం త్వరలోనే ఒక భారీ డిజిటల్ విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్‌ఫారమ్ కింద ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ లోని డబ్బును నేరుగా యూపీఐ యాప్స్, ఈపీఎఫ్ తో అనుసంధానించబడిన ఏటీఎంల ద్వారా నేరుగా డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ సరికొత్త సదుపాయం జూన్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త టెక్నాలజీ వ్యవస్థకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని కేంద్ర శ్రమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గతంలోనే సూచనప్రాయంగా వెల్లడించారు.

Tags:    

Similar News